వైఎస్ఆర్ సిపి ఎంమ్మెల్సీ అభ్యర్థి బాబాయ్ యేన ?

కొద్దిరోజుల్లో జ‌ర‌గ‌నున్న‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బ‌రిలోకి వైసీపీ త‌ర‌పున తానే అభ్య‌ర్థినన్న‌ట్టుగా వైఎస్ వివేకాంనంద‌రెడ్డి ఒక‌ప‌క్క ముమ్మ‌రంగా ప్ర‌చారంలోకి సైతం దిగిపోయారు. ఈయ‌న‌ విప‌క్ష‌నేత వైఎస్‌ జ‌గ‌న్మోహ‌న‌రెడ్డికి పిన‌తండ్రి అన్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే క‌డ‌ప జిల్లాలో ఆయన ఒక్కో మండలానికీ వెళ్లి.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మాట్లాడుతూ త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేలా అందరినీ కలుపుకుని వెళుతున్నారు.  జిల్లాలోని వివిధ‌ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలుసుకుంటూ.. పార్టీ  ఓట్లను గుర్తించి, పార్టీకి అండ‌గా నిల‌వాల‌ని సూచిస్తూ ఆయ‌న ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు.. వైసీపీకి చెందిన‌ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా వివేకానంద‌రెడ్డి వెంట కనిపిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఈ ఎన్నికల్లో గెలుపును అధికార‌ తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాము ఈ ఎన్నిక‌ల్లో గెలిచి తీరతామని ఇప్పటికే టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ సవాల్‌ విసిరిన సంగ‌తి ఈ సంద‌ర్భంగా గ‌మ‌నించాల్సిఉంది.  మరి జిల్లాలో ఇంత రాజకీయ వేడి ఉన్న స‌మ‌యంలో.. నిజానికి అస‌లు వైసీపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్నఅంశంపై పార్టీ అధినేత జ‌గ‌న్ ఇంకా నిర్ణ‌యమే తీసుకోలేద‌ని తెలియ‌డంతో వైసీపీ శ్రేణులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నాయి. ఒకవైపు వివేకానందరెడ్డి జిల్లాలో తిరుగుతున్నా.. పార్టీ తరపున ఆయనే అభ్యర్థి అంటూ పార్టీ అధినేత నుంచి అంగీకారం మాత్రం రావడం లేదు! ఈ విషయంలో జగన్‌ ఏమనుకుంటున్నారో అర్థంకాని వైసీపీ శ్రేణులు ప్ర‌స్తుతం అయోమ‌య ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాయ‌ని చెప్పాలి. ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అధికార టీడీపీ కూడా ఇంకా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. ఆ పార్టీ తరపున చాలా మంది ఆశావ‌హులు టికెట్‌ కోసం పోటీలు పడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధుల ఓట్ల‌తో జ‌రిగే ఈ ఎన్నిక‌ల్లో ధ‌న‌ప్ర‌భావం గ‌ట్టిగా ఉండ‌బోతుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. నిజానికి ఈ ఎమ్మెల్సీ ప‌రిధిలోకొచ్చే ప్రాంతాల్లో స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధుల ఓట్ల లెక్క‌లు తీస్తే ప్ర‌స్తుతం వైసీపీకే మెజారిటీ ఉంది. అయితే ప్రస్తుతం విప‌క్ష ఎమ్మెల్యేలే అధికార పార్టీ వైపు జంప్ జిలానీలుగా మారుతున్న‌  ప‌రిస్థితుల్లో వీరంతా విప‌క్షానికి ఓటు వేస్తార‌ని ఎవ‌రూ చెప్ప‌లేరు. మేయర్‌, చైర్మన్‌ల ఎన్నికల సమయంలోనే ఇలాంటి వాళ్లు డబ్బుకు అమ్ముడుపోయి అవతల పార్టీకి ఓటు వేయడం రొటీన్‌గా జరిగే తంతే.  దీనికితోడు అధికార పార్టీ ఇక్కడ గెలిచి.. ఇదే ప్రజా తీర్పు అని, జగన్‌ను ప్రజలు తిరస్కరించారని ప్రకటించాలని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది.

ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల్లో గెలిచి త‌న ప‌ట్టు స‌డ‌ల‌లేద‌ని నిరూపించుకునేందుకు జ‌గ‌న్ పార్టీ కూడా ధ‌న ప్ర‌వాహానికి గేట్లు ఎత్త‌క త‌ప్ప‌ద‌న్న‌మాట‌. మొత్తంమీద ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో డ‌బ్బు ఏరులై పార‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. మ‌రి అభ్య‌ర్థులు కూడా  ఆ స్థాయిలో వెచ్చించ‌గ‌ల స‌మ‌ర్థులే అయి ఉండాల‌ని రెండుపార్టీలు కోరుకుంటూ ఉంటే ఆశ్చ‌ర్యం ఏమాత్రం లేదు మ‌రి…!