మ‌హేష్ సినిమా కోసం కొర‌టాల‌కు క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌

టాలీవుడ్‌లో ద‌ర్శ‌కుడిగా అత‌డి అనుభవం మూడంటే మూడు సినిమాలు. అయితేనేం మూడు సినిమాల‌కే అత‌డు టాప్ డైరెక్ట‌ర్ రేంజ్‌కు ఎదిగిపోయాడు. ఆ మూడు సినిమాలు ఒక‌దానిని మించి మ‌రొక‌టి బ్లాక్ బ‌స్ట‌ర్లు అయ్యాయి. దీంతో ఇప్పుడు ఆ హీరోతో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం క్యూ క‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో  ఆ డైరెక్ట‌ర్ క్రేజ్‌తో పాటు రేటు కూడా అమాంతం పెంచేశాడు. ఇప్పుడు ఈ విష‌యం టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో పెద్ద సంచ‌ల‌న‌మైంది.

 

మాట‌ల ర‌చ‌యిత‌గా కేరీర్ స్టార్ట్ చేసిన కొర‌టాల శివ మిర్చి సినిమాతో డైరెక్ట‌ర్‌గా మెగాఫోన్ ప‌ట్టాడు. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌హేష్‌తో తెర‌కెక్కించిన శ్రీమంతుడు, ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌తో శివ తీసిన జ‌న‌తా గ్యారేజ్ సినిమాలు టాలీవుడ్ ఆల్ టైం టాప్‌-3 సినిమాల‌లో ఏకంగా 2, 3 స్థానాలు సొంతం చేసుకున్నాయి. బాహుబ‌లిని వ‌దిలేస్తే కొరటాల శివ తీసిన శ్రీమంతుడు – జ‌న‌తా గ్యారేజ్ సినిమాలే టాప్ 1,2 ప్లేస్‌లో ఉన్నాయి. దీనిని బ‌ట్టి శివ క్రేజ్ ఎలా ఉందో తెలుస్తోంది.

 

ఇదిలా ఉంటే కొర‌టాల ప్ర‌స్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో సినిమా చేసేందుకు మ‌రోసారి రెడీ అవుతున్నాడు. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం వినిపిస్తోంది. ఈ సినిమా నిర్మాత‌ డీవీవీ దానయ్య.. కొరటాలకు భారీ ఆఫర్‌నే ఇచ్చాడట. శివ‌కు పారితోషికంగా.. ఈ సినిమా ఓవర్సీస్‌ హక్కులను కొరటాలకు వ‌దులుకునేందుకు సిద్ధ‌మేన‌ని దానయ్య చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

 

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్‌కు ఓవ‌ర్సీస్‌లో ఉండే క్రేజ్ ఏంటో అంద‌రికీ తెలిసిందే. అంటే ఈ సినిమా ద్వారా కొరటాలకు దాదాపు 15 నుంచి 18 కోట్ల రూపాయల వరకు పారితోషికంగా ముట్ట‌బోతోంద‌ని స‌మాచారం. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంద‌ని తాజా స‌మాచారం. మ‌హేష్ సీఎంగా క‌నిపిస్తాడ‌ని కూడా టాక్ వ‌స్తోంది.