ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీగా ఉన్న జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న సినిమాల స్పీడ్‌ను పెంచేశాడు. ఇప్పుడు ప‌వ‌న్ సినిమాల కోసం త‌న గేరును ఓ రేంజ్‌లో పెంచేశాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం గోపాల గోపాల డైరెక్ట‌ర్ డాలీ డైరెక్ష‌న్‌లో ‘కాటమరాయుడు’ షూటింగ్ చకచకా కానిచ్చేస్తున్నాడు ప‌వ‌న్‌. ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా మార్చి 28న రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే అప్పుడే మ‌రో రెండు సినిమాల‌కు కూడా కొబ్బ‌రి కాయ కొట్టేశాడు. కోలీవుడ్‌లో జిల్లా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను తెర‌కెక్కించిన తమిళ డైరెక్టర్ టీఎన్ నీశన్ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు ప్రారంభోత్సవం జరిపించేశాడు. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాత‌..గ‌తంలో ప‌వ‌న్‌తో ఖుషీ – బంగారం లాంటి సినిమాలు నిర్మించిన ఏఎం.ర‌త్నం నిర్మించ‌నున్నారు.

ఇదిలా ఉంటే నీశ‌న్ సినిమా ప్రారంభ‌మైన కొద్ది రోజుల‌కే త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో న‌టించే సినిమాకు కూడా కొబ్బ‌రికాయ కొట్టేశాడు. అయితే చాలా మందిలో ముందు ప‌వ‌న్ నీశ‌న్ సినిమాను ప‌ట్టాలెక్కిస్తాడా ?  త్రివిక్ర‌మ్ సినిమాను ప‌ట్టాలెక్కిస్తాడా ? అన్న క‌న్‌ఫ్యూజ‌న్ ఉంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం టీఎన్ నీశన్ దర్శకత్వంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పుడిప్పుడే మొదలు కాదట.వ‌చ్చే నెల నుంచి కాట‌మ‌రాయుడుతో స‌మానంగా ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ట‌. ఈ యేడాది డిసెంబ‌ర్‌కు కాట‌మ‌రాయుడు కంప్లీట్ చేసి ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్‌ను సింగిల్ షెడ్యూల్‌లో ప‌వ‌న్ ఫినిష్ చేస్తాడ‌ట‌. వ‌చ్చే స‌మ్మ‌ర్ నుంచి నీశ‌న్ సినిమా స్టార్ట్ అవుతుంద‌ట‌.

ఇక ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమాను వ‌చ్చే యేడాది ఆగస్టు 15కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. ఇక కాట‌మ‌రాయుడు మార్చి 28న రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. నీశ‌న్ సినిమా కూడా త్వ‌ర‌గా కంప్లీట్ చేసి వ‌చ్చే యేడాది మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌న్న‌దే ప‌వ‌న్ ప్లాన్‌.