చిరు కోసం రంగంలోకి ఆ ఇద్ద‌రు మంత్రులు..!

అవును. కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కోసం.. టీడీపీ మంత్రులు ఇద్ద‌రు రంగంలోకి దిగారు! ఈ ప‌రిణామం ఎందుకంటారా? ఏపీలో ఇప్పుడు రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల వేడి రాజుకుంటోంది! 2019 ఎన్నిక‌లకు సంబంధించి నేత‌లు ఇప్పుడు త‌మ త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో అధికార టీడీపీ దృష్టి ఇప్పుడు చిరంజీవిపై ప‌డింది. ఆయ‌న‌ను త‌మ పార్టీలోకి చేర్చుకునే దిశ‌గా నేత‌లు పావులు క‌దుపుతున్నారు. ఆయ‌న‌ను రంగంలొకి దింప‌డం వ‌ల్ల 2019లోనూ ఎలాంటి ప్ర‌యాస ప‌డ‌కుండా రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌ని ప‌క్కా ప్లాన్ సిద్ధం చేశారు. మ‌రి ఎందుకు వారు అలా డిసైడ్ అయ్యారో తెలియాలంటే.. ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే..

2019 ఎన్నిక‌లు ప్ర‌స్తుత టీడీపీ ప్ర‌భుత్వానికి ముఖ్యంగా చంద్ర‌బాబుకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. అహ‌ర్నిశ‌లు ఏపీని అభివృద్ధి చేస్తున్న చంద్ర‌బాబు రెండోసారి కూడా ఇక్క‌డ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, అదే స‌మ‌యం ప్ర‌ధాన విప‌క్షం వైకాపా కూడా అధికారంలోకి వ‌చ్చేందుకు ఎన్నో శ‌క్తియుక్తుల్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ పార్టీకి కూడా అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ అటు ఆర్థికంగా ఇటు కేసుల‌తోనూ స‌త‌మ‌వుతున్న నేప‌థ్యంలో పార్టీ ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డే ప‌రిస్థితి ఉంది. దీంతో టీడీపీకి వైకాపా గ‌ట్టి పోటీ ఇచ్చేప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ స‌మ‌యంలో 2014లో మాదిరిగా ప‌వ‌ర్ స్టార్‌తో పొత్తు పెట్టుకుని బ‌రిలో నిలుద్దామా? అంటే అది అంత వీజీకాదు ఈ సారి!

ఎందుకంటే.. గ‌తంలో ఆయ‌న పార్టీ పెట్టినా.. కూడా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొన‌లేదు. కానీ, ఈ ద‌ఫా మాత్రం ఎన్నిక‌ల‌కు వెళ్తున్నారు. మొత్తంగా ఏపీ, తెలంగాణ‌ల్లో ఆయ‌న పార్టీని విస్త‌రించ‌డంతోపాటు ఎన్నిక‌ల‌కు కూడా వెళ్తున్నారు. ఇది టీడీపీకి వ్య‌తిరేకంగా ప‌రిణ‌మించే ఛాన్స్ ఉంది. ఇక‌, ప‌వ‌న్ ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే, టీడీపీ మాత్రం ప్యాకేజీతో స‌రిపెట్టుకుంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ టీడీపీల పొత్తు అంత సాధ్య‌మ‌య్యేలా లేదు. అంతేకాకుండా ప‌వ‌న్ హోదాను అడ్డుపెట్టుకుని జ‌నాల్లో దూకుడు పెంచే ఛాన్స్ కూడా ఉంది.

ఇప్ప‌టికే ఆయ‌న ఏలూరులో ఓట‌రుగా న‌మోదు చేసుకునే య‌త్నాల్లో ఉన్నారు. ఇక‌, ఇప్ప‌టికే తెలంగాణలో పార్టీకి నేత‌ల‌ను నియ‌మించిన‌ట్టే త్వ‌ర‌లోఏపీలోనూ నేత‌ల‌ను నియ‌మిస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌తో ఇప్ప‌టి నుంచే టీడీపీ ఇటు ప‌వ‌న్‌ని , అటు జ‌గ‌న్‌ని అడ్డుకునేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈక్ర‌మంలోనే చిరును రంగంలోకి అదికూడా నేరుగా సైకిల్ ఎక్కించుకోవాల‌ని నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. చిరు అయితే, ప‌వ‌న్ దూకుడు త‌గ్గుతుంద‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు.

ఇక‌, ఇప్ప‌డు చిరు కాంగ్రెస్‌లో ఉన్నా.. ఆపార్టీకి ఇప్ప‌ట్లో భ‌విష్య‌త్తు లేదుకాబ‌ట్టి.. ఆయ‌న‌ను టీడీపీలో చేర్చుకుని మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు పంపేలా హామీ ఇవ్వ‌డంతోపాటు కేంద్రంలో ప‌ద‌విని ఇప్పించాల‌ని టీడీపీ యోచిస్తున్న‌ట్టు తెలిసింది. దీనికిగాను మంత్రులు గంటా శ్రీనివాస‌రావు, కామినేని శ్రీనివాస‌రావులు రంగంలోకి దిగి మంత్రాంగానికి సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ ప్ర‌తిపాద‌న‌పై చిరు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.