చంద్ర‌బాబుది రావ‌ణాసురుడి అన్న‌య్య పాల‌నా?!

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వెరైటీగా విరుచుకుప‌డ్డారు. ఏపీలో భ‌య‌ప‌డుతూ బ‌త‌కాల్సి వ‌స్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం నుంచి ప్రారంభం కావాల్సిన రావుల‌పాలెం – అంత‌ర్వేది ముద్ర‌గ‌డ కాపు స‌త్యాగ్ర‌హ పాద‌యాత్రను ప్ర‌భుత్వం అడ్డుకుంది. ముద్ర‌గ‌డ‌పై నేరుగా ఎలాంటి వ్యాఖ్య‌లూ చేయ‌ని పోలీసులు ఆయ‌న పాద‌యాత్రలో అసాంఘిక శ‌క్తులు ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటూ ముద్ర‌గ‌డ‌ను మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న ఇంటి వ‌ద్దే నిర్బంధించారు. ఈ క్ర‌మంలో పోలీసుల‌కు, ముద్ర‌గ‌డ‌కు మ‌ధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జ‌రిగినా.. ముద్ర‌గ‌డ స‌ర్దుకు పోయారు.

ఈ స‌మ‌యంలో ముద్ర‌గ‌డ మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను, త‌న జాతి నేత‌లు శాంతి యుత పంథాలో చేయాల‌నుకున్న పాద‌యాత్ర‌ను చంద్ర‌బాబు క‌క్ష‌క‌ట్టి అడ్డుకున్నార‌ని అన్నారు. త‌న‌ను హౌస్ అరెస్టు చేశార‌ని చెప్పిన ముద్ర‌గ‌డ‌.. ఎన్నాళ్లు త‌న‌ను హౌస్ అరెస్టు చేస్తారో చెప్పాల‌ని కోరినా పోలీసులు చెప్ప‌లేద‌ని అన్నారు. పాద‌యాత్ర‌కు అనుమ‌తి లేద‌ని చెప్పార‌ని, వాళ్లు ఎప్పుడు అనుమ‌తి ఇస్తే.. అప్పుడే చేప‌డ‌తాన‌ని ముద్ర‌గ‌డ వెల్ల‌డించారు.

ఈ క్ర‌మంలో బాబు పాల‌న క‌న్నా తెలంగాణ‌లో పాల‌న భేషుగ్గా ఉంద‌ని చెప్పారు.  ‘‘రాష్ట్రంలో రావణాసురుడు అన్నయ్య పాలనను చూస్తున్నాం. మా హక్కుల కోసం పోరాడుతూ రిజర్వేషన్లు మాత్రమే కోరుతున్నాం. ఇతర కులా లకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్లు కల్పిం చాలని కోరుతున్నాం. ప్రభుత్వం మాత్రం ఇతర కులాలను రెచ్చగొడుతోం ది. బాబు పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీని పాదయాత్ర ద్వారానే గుర్తు చేయాలని జేఏసీ నిర్ణయించింది. పాదయాత్రలపై టీడీపీకి ఒక చట్టం మాకొక చట్టమా?  చంద్రబాబు పాదయాత్రకు పర్మిషన్ తీసుకున్నారా? రిజర్వేషన్లు సాధించే వరకు నిరసనలు కొనసాగిస్తాం’’ అన్నారు. తెలంగాణ‌లో ఉన్న ప్రశాంత‌త ఏపీలో లేద‌ని చెప్పారు.  మొత్తానికి బాబు పాల‌న‌పై ముద్ర‌గ‌డ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

వాస్త‌వానికి రావ‌ణాసురిడి అన్న‌య్య కుబేరుడు! ఈయ‌న మంచి పాల‌కుడిగా ప్ర‌జ‌ల్లో ఉత్త‌మ‌మైన పేరు తెచ్చుకున్నాడు. ఈయ‌న క‌ష్ట‌ప‌డి నిర్మించుకున్న లంకా ప‌ట్ట‌ణాన్ని.. రావ‌ణాసురుడే దౌర్జ‌న్యం చేసి ఆక్ర‌మించుకున్నాడు. ఆ త‌ర్వాత కుబేరుడు త‌మ్ముడిని ఎదిరించ‌లేక‌.. అల‌కాపురి అనే మ‌రో స‌రికొత్త ప‌ట్ట‌ణాన్ని నిర్మించుకున్నాడు. దీనిని కూడా ఆక్ర‌మించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలోనే రావ‌ణాసురుడి చూపు సీతా దేవిపై ప‌డింద‌ని అంటారు. ఇక‌, ఆ త‌ర్వాత స్టోరీ తెలిసిందే. సో.. బాబుపై ముద్ర‌గ‌డ విమ‌ర్శ‌లు దారి త‌ప్పాయ‌నే టాక్ విన‌బ‌డుతోంది. రావ‌ణాసురుడి క‌న్నా ద‌రిద్రంగా బాబు పాల‌న ఉంద‌ని చెప్ప‌బోయి.. ఆయ‌న అన్న పాల‌న‌తో పోల్చారు. ఏదేమైనా.. టీడీపీ త‌మ్ముళ్లు మాత్రం ముద్ర‌గ‌డ విమ‌ర్శ‌ల‌పై న‌వ్వుకుంటున్నారు.