కొత్త ట్విస్ట్ జ‌గ‌న్‌తో కాంగ్రెస్ దోస్తీ

ఎవ‌రు కాద‌న్నా.. అవున‌న్నా..   ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన పునాదులున్నాయి. ఈ రాష్ట్రంలో అత్య‌ధిక కాలం అధికారంలో ఉన్న చ‌రిత్ర కూడా ఆ పార్టీ పేరునే లిఖించ‌బ‌డి ఉంది.  అయితే రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆ పార్టీ ఉనికి సైతం ఏపీలో ప్ర‌శ్నార్థ‌కంగా మారిన సంగ‌తి తెలిసిందే… అయితే  కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా అప్ప‌టిదాకా బ‌లంగా ఉంటూ వ‌చ్చిన ఓటు బ్యాంకు అంతా ఏమైంది..? ఈ ప్ర‌శ్న ఎవ‌రిలోనైనా త‌లెత్తితే వెంట‌నే వారి చూపులు వైఎస్ జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలోని వైసీపీ  వైపే మ‌ర‌లుతాయి. అవును మ‌రి. ఆ ఓటు బ్యాంకు ఎక్క‌డికీ పోలేదు. వైసీపీ రూపంలో ఏపీలో ఇప్ప‌టికీ భ‌ద్రంగానే ఉంది.

ఈ నేప‌థ్యంలో  ఎంత లెక్క తేడా వచ్చినా.. తల్లికి.. పిల్లకు మధ్యనున్న అనుబంధాన్నిఎవ‌రూ ఎన్న‌టికీ తుంచేయలేర‌న్నప‌ర‌మ‌ స‌త్యాన్ని అమాయ‌క జ‌నం తెలుసుకోవాలి మ‌రి. కాలం పెట్టే పరీక్షలో… లేదా సామాన్యులకు ఏమాత్రం అర్థం కాని రాజ‌కీయ, క్రీడ‌లు, వ్యూహాల్లో భాగ‌మో తెలియ‌దు కాని.. ఇప్ప‌టిదాకా తాము వేరువేర‌ని చెప్పుకుంటూ వ‌చ్చిన త‌ల్లి, పిల్ల కాంగ్రెస్ పార్టీలు వ‌చ్చే ఎన్న‌కల నాటికి క‌లిసిపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.  కేవ‌లం విభ‌జ‌న పాపం కాంగ్రెస్‌ను వెంటాడుతుండ‌టంతో ఆ వ్య‌తిరేక‌త త‌మ‌ను ఎక్కడ ముంచేస్తుందోన‌న్న భ‌యమే వైసీపీని ఆపుతోంది కాని ఈ రెండు పార్టీలు ఎప్పుడో జ‌త క‌ట్టేసేవ‌ని టీడీపీ వ‌ర్గాలు త‌ర‌చూ చెప్పే మాట‌లు అక్ష‌ర స‌త్యాలుగా  తాజాగా  కాంగ్రెస్  సీనియ‌ర్ నేత‌, సోనియా ప‌రివారానికి అత్యంత విదేయుడైన డిగ్గీ రాజా వ్యాఖ్య‌లు తేల్చేస్తున్నాయి.

దిగ్విజయ్ సింగ్ నోటి నుంచి తాజాగా వచ్చిన ఒక కీలక వ్యాఖ్య ఏపీలోని పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. త్వరలో ఏపీ సర్కారు వైఫల్యాలపై విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టాలని భావిస్తున్న పాదయాత్రపై డిగ్గీ రాజా రియాక్ట్ అయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్ తండ్రి.. దివంగత ముఖ్య‌మంత్రి  వైఎస్ బాటలోనే ఇప్ప‌డు జ‌గ‌న్ న‌డుస్తుండ‌టం అభినంద‌నీయ‌మ‌ని, జ‌గ‌న్ కూడా తండ్రి మాదిరే  పాదయాత్రను విజయవంతంగా ముగించాలని దిగ్విజ‌య్ ఆశీర్వ‌చ‌నాలు అందించేశారు.

మ‌రి జ‌గ‌న్ యాత్ర గురించి డిగ్గీ రాజా వ్యాఖ్య‌లు చూసిన వారెవ‌రికైనా జ‌గ‌న్ ఇంకా కాంగ్రెస్‌పార్టీలోనే ఉన్నారా…?  లేక త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌లో త‌న పార్టీని కాంగ్రెస్‌లో క‌లిపేస్తున్నారా…? అని సందేహాలు త‌లెత్తితే ఆశ్చ‌ర్యం ఏమాత్రం లేదు మ‌రి. జ‌గ‌న్ అవినీతి వ్య‌వ‌హారాల మీద కాంగ్రెస్ హ‌యాంలోనే జ‌రిగిన ద‌ర్యాప్తుల సంగ‌తేమైందో తెలియ‌దు కాని… డిగ్గీరాజా తాజా వ్యాఖ్య‌లు జ‌గ‌న్ ప‌రివారానికి సంతోషం క‌లిగిస్తున్నాయ‌న‌డం మాత్రం వాస్త‌వం.