కుంభ‌కోణంలో ఆ ఏపీ మంత్రి రాజీనామా..!

2014-15 మ‌ధ్య కాలంలో గుంటూరు కేంద్రంగా జ‌రిగిన ప‌త్తి కొనుగోళ్ల‌లో వెలుగు చూసిన కుంభ‌కోణం దేశాన్ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. ద‌ళారులు, వ్యాపారుల‌తో కుమ్మ‌క్క‌యిన మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది రైతుల నుంచి ప‌త్తిని అతి త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసి, ఎక్కువ మొత్తానికి కొన్న‌ట్టు రికార్డులు సృష్టించారు. ఈ క్ర‌మంలో దాదాపు 1000 కోట్ల మేర‌కు కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు విజిలెన్స్ విభాగ‌మే నిగ్గు తేల్చింది. దాదాపు ల‌క్షా 93 వేల క్వింటాళ్ల ప‌త్తిని రైతుల నుంచి కొన్న‌ట్లు రికార్డుల్లో చూపారు. అయితే, దీనిపై విచార‌ణ జ‌ర‌ప‌గా ఇదంతా బోగ‌స్ అని స్ప‌ష్ట‌మైపోయింది.

మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది, బ‌య్య‌ర్లు కుమ్మ‌క్క‌యి రైతుల‌ను నిలువునా ముంచార‌ని తేలింది.  ఈ క్ర‌మంలో విచార‌ణ‌కు దిగిన విజిలెన్స్ అధికారులు 650 కోట్ల కుంభ‌కోణం నిజ‌మేన‌ని తేల్చారు. ఆ త‌ర్వాత దీనిపై సీబీఐని కూడా వేశారు. ఈ క్ర‌మంలోనే మార్కెటింగ్ శాఖ‌లోని 19 మంది ఉద్యోగుల‌ను ఒక్క‌సారిగా స‌స్పెండ్ చేశారు. దీనిని బ‌ట్టి ఈ కుంభ‌కోణం తీవ్ర‌త అర్ధ‌మవుతుంది. ఇక‌, ఈ కుంభ‌కోణంపై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో మార్కెటింగ్ శాఖ అత్యంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంపైనా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగాయి.

ఈ క్ర‌మంలోనే తాజా, స‌స్పెండ్ అయిన అధికారులు త‌మ‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా ఉండేలా చూసేందుకు ఏకంగా మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకే లంచాలు ఇచ్చిన‌ట్టు విష‌యం వెలుగు చూసింది. మంత్రి ప్ర‌త్తిపాటి పేషీకి చెందిన అధికారికి రూ.30 ల‌క్ష‌లు ముట్ట‌జెప్పిన‌ట్టు తెలుస్తోంది. మంత్రికి తెలియ‌కుండానే ఇదంతా జ‌రిగిందా? అనేది ఇక్క‌డ త‌లెత్తుతున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌. దీంతో ఆయ‌న మంత్రిని పిలిచి సంజాయిషీ కూడా కోరిన‌ట్టు తెలుస్తోంది.

అయితే, తాను అమాయ‌కుడిన‌ని, ఏమీ తెలియ‌ద‌ని పుల్లారావు బ‌దులిచ్చార‌ట‌. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు అలా లేవ‌ని తెలుస్తోంది. రూ. కోట్ల కుంభ‌కోణం జ‌రిగి మార్కెట్ శాఖ‌కు చెందిన 19 మంది ఉన్న‌త, మ‌ధ్య స్థాయి అధికారులు సైతం స‌స్పెండ్ అయిన నేప‌థ్యంలో మంత్రికి తెలియ‌కుండా ఎలా జ‌రుగుతుంద‌ని బాబు సైతం భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే నేడో రేపో ప్ర‌త్తిపాటితో రిజైన్ చేయించే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయ‌ని తెలుస్తోంది. గ‌తంలోనూ మంత్రి గారి శాఖ‌పై కుటుంబ పెత్త‌నం ఎక్కువైంద‌ని, వ‌సూళ్లు పెరిగాయ‌ని బాబుకి కంప్ట‌యింట్లు వెళ్ల‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఈ ద‌ఫా ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.