ఇర‌కాటంలో లోకేష్‌..!

ఔను.. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ ఉర‌ఫ్ చిన‌బాబు ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డిపోతున్నారు. ఎవ‌రి ప్రైవేటు బ‌తుకులు వారివి.. ప‌బ్లిక్‌లోకి వ‌స్తే.. తెలుస్తుంది- అన్నారు మ‌హాక‌వి శ్రీశ్రీ. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి లోకేష్ కూడా ఎదుర్కొంటున్నారు. మొన్న‌టి వ‌ర‌కు నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉన్న ఆయ‌న‌ ఇటీవ‌ల ఆయ‌న ప‌బ్లిక్‌లోకి వ‌స్తున్నారు. ఈ నెల 1న టీడీపీ ప్రారంభించిన జ‌న చైత‌న్య యాత్ర‌ల‌కు కొద్దిగా పేరు మార్చి యువ చైత‌న్య యాత్ర పేరుతో ఆయ‌న ప‌లు కాలేజీల‌కు వెళ్లి విద్యార్థుల‌తో ఇంట‌రాక్ట్ అవుతున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న 2019 నాటికి టీడీపీని అధికారంలోకి తీసుకురావ‌డంపైనే దృష్టి పెట్టారు. యువ‌త ఓట్ల‌ను పెద్ద ఎత్తున టీడీపీకి ఒడిసి ప‌ట్టాల‌ని లోకేష్ భావిస్తున్నారు. అయితే, ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు పెద్ద ఇర‌కాటం ఎదుర‌వుతోంది. యువ‌త సంధించే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక చిన‌బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా గూడురులోని ఆదిశంక‌ర కాలేజీలో జ‌రిగిన ఓ స‌ద‌స్సుకు లోకేష్ వెళ్లారు.

య‌థాప్ర‌కారం యువ‌త‌తో ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఓ విద్యార్థి వేసిన ప్ర‌శ్న‌కు లోకేష్‌కి దిమ్మ‌తిరిగి పోయింది. ‘అవినీతిని అంతం చేస్తామ‌ని చెబుతుంటారు. కానీ, మీ పార్టీలోనే ఉన్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారు. ఆయ‌నపై ఇంత‌వ‌ర‌కూ ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు’ అని స్టూడెంట్ ప్ర‌శ్నించాడు. లోకేష్ ద‌గ్గ‌ర నో ఆన్స‌ర్‌!

‘పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తే అవినీతి అంత‌మైపోతుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌ల‌హా ఇచ్చారు. కానీ, ఇప్పుడు పెద్ద తిమింగ‌లాలు త‌ప్పించుకుంటూ చిన్న చేప‌లు చ‌చ్చిపోతున్నాయి. ఈ ప‌రిస్థితిపై మీ కామెంట్ ఏంటీ’ మ‌రో కొంటె కోణంగి ప్ర‌శ్న.  ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎందుకు రాలేదు, కృష్ణ‌ప‌ట్నం పోర్టు ప్రాంతంలోని స్థానికుల‌కు ఎందుకు ఉద్యోగాలు రావ‌డం లేదు, న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని కేవ‌లం ధ‌నికుల కోస‌మే నిర్మిస్తున్న‌ట్టుగా ఉంది… ఇలా.. ప్రశ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు విద్యార్థులు.  సో.. వీటికి ఆన్స‌ర్లు చెప్ప‌లేక‌.. దాట వేయ‌లేక నానా తిప్ప‌లు ప‌డ్డార‌ట లోకేష్‌. మ‌రి ప‌బ్లిక్ అంటే త‌మాషానా?!