ఆలీ నోట‌.. పొలిటిక‌ల్ మాట‌!!

కామెడీ కింగ్ ఆలీ.. సిల్వ‌ర్ స్క్రీన్‌పైనే కాదు.. ప‌బ్లిక్‌లో సైతం ఎక్క‌డ మైకు ప‌ట్టుకున్నా.. ఆడియ‌న్స్ నుంచి న‌వ్వుల జల్లు కురియాల్సిందే. ఆడియ‌న్స్‌కి న‌వ్వ‌లేక న‌వ్వ‌లేక‌ క‌డుపు చెక్క‌లు కావాల్సిందే. అలాంటి కామెడీ కింగ్‌.. ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో నిప్పులు కురిపించాడు! పొలిటీషియ‌న్ల‌పై త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ల‌ను ఎంత మాత్రం ఆలోచించ‌కుండానే క‌క్కేశాడు. దీంతో.. స‌భ మొత్తం ఒక్క‌సారిగా సీరియ‌స్ అయిపోయింది. ఆలీలో ఇంత పొలిటిక‌ల్ సైడ్ ఉందా? అని అంద‌రూ చ‌ర్చించుకున్నారు.

రెండు రోజుల కింద‌ట గుంటూరులో జ‌రిగిన ముస్లిం మైనార్టీ కార్య‌క్ర‌మంలో ఆలీ పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. 2019 ఎన్నిక‌ల్లో ముస్లింల‌కు ఏ రాజ‌కీయ పార్టీ ఎక్కువ సంఖ్య‌లో సీట్లు ఇస్తుందో, ఆ పార్టీకే ముస్లింలు ఓటు వేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. ముస్లింలంటే.. రంజాన్‌, బ‌క్రీద్ వంటి కార్య‌క్ర‌మాల్లోనే నేత‌ల‌కు గుర్తొస్తున్నార‌ని చుర‌క‌లు అంటించారు. పొలిటిక‌ల్ నేత‌లు ఆయా పండ‌గ‌ల‌ప్పుడు టోపీలు పెట్టుకుంటున్నార‌ని, ఆ త‌ర్వాత మ‌ళ్లీ పండ‌గ వ‌చ్చే వ‌ర‌కు ఆ టోపీల‌ను ముస్లింల‌కు పెడుతున్నార‌ని విమ‌ర్శించారు.

ఈ నేప‌థ్యంలోనే ఆలీ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఊహాగానాలు పెరిగిపోయాయి. అయితే, ఆయ‌న ఏ పార్టీ అనేది స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఇప్ప‌టికైతే.. ఆయ‌న తానెంతో గౌర‌వించే ప‌వ‌న్ పార్టీలోకే జంప్ చేస్తాడ‌ని టాక్ వ‌స్తోంది. అంతేకాకుండా 2019 ఎన్నిక‌ల్లో గుంటూరులో మైనార్టీకి ప‌ట్టున్న తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఒక‌వేళ స‌మీక‌ర‌ణ‌లు కుద‌ర‌ని ప‌క్షంలో  సొంత ఊరు రాజ‌మండ్రి న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి అయినా ఆలీకి సీటు క‌న్ఫ‌ర్మ్ చేసే ఛాన్సులు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. బ‌హుశ ఈ క్ర‌మంలోనేఎప్పుడూ లేంది ఆలీ నోట ఈ పొలిటిక‌ల్ కామెంట్ల‌ని అంద‌రూ చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.