షేర్ మార్కెట్‌లో టాటా డిజాస్ట‌ర్ షో

అవును! ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత టాటా స‌న్స్ కంపెనీ లాభాలు భారీ స్థాయిలో ప‌డిపోయాయి. టాటా స‌న్స్ 6వ చైర్మ‌న్‌గా ఉన్న సైర‌స్ ప‌ల్లోంజీ మిస్త్రీని ప‌నితీరు ఆధారంగా అర్ధంతరంగా తొల‌గించిన ఎఫెక్ట్ భారీ స్థాయిలో కంపెనీని కుదిపేస్తోంది. దీనికితోడు ఆయ‌న చైర్మ‌న్‌గా ఉన్న సమ‌యంలోనూ టాటా కంపెనీ లాభాలు పెద్ద ఎత్తున న‌ష్ట‌పోయిన విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఏడాది మార్చి వరకు టాటా సన్స్ లాభాలు 67 శాతం కుదేలై, రూ.3,013 కోట్లగా నమోదైనట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్ లో పేర్కొంది.

అదేవిధంగా రెవెన్యూలు కూడా 39 శాతం క్షీణించి రూ.8,104 కోట్లగా నమోదుచేసింది. ఈ ప‌రిణామం టాటా చ‌రిత్రలో ఇదే తొలిసార‌ని వాణిజ్య దిగ్గ‌జాలు చెబుతున్నాయి. గత ఆర్థికసంవత్సరం టీసీఎస్ కంపెనీ చెల్లించిన ఎక్కువ డివిడెంట్లు కూడా స్వతంత్ర ఆదాయాలకు కొంత గండికొట్టినట్టు తెలిసింది.  గతేడాది కంపెనీ డివిడెంట్లు కింద రూ.11,450 కోట్లను చెల్లించింది. కంపెనీ స్వతంత్ర ఆదాయాలకు, ఏకీకృత ఆదాయాకు పెద్దగా తేడా లేనప్పటికీ, లాభాల్లో మాత్రం కంపెనీ పడిపోయింది.  దీంతో మిస్త్రీ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న బోర్డు సభ్యులు … చైర్మన్ పదవికి ఎన్నికై నిండా నాలుగేళ్లు కూడా కొనసాగకముందే ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.

ఇక‌, త‌న‌కు సంజాయిషీ కూడా చెప్పుకొనే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని ఆగ్ర‌హించిన సైర‌స్.. ఇంటి గుట్టును బ‌య‌ట పెట్టారు. వాస్త‌వానికి ర‌త‌న్ టాటా తీసుకున్న నిర్ణ‌యాలే కొంప ముంచాయ‌ని చెప్పాడు. దీంతో భారీస్థాయిలో టాటా షేర్లు ప‌త‌న‌మ‌య్యాయి. దీంతో మ‌రింత ఆగ్ర‌హించిన టాటా గ్రూప్ సైర‌స్‌ను పూర్తిగా టాటా నుంచి సాగ‌నంపేందుకు రెడీ అయిన‌ట్టు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఇక‌, ఇప్పుడు తాత్కాలిక చైర్మ‌న్‌గా ర‌త‌న్ టాటాను ఎన్నుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న టాటాను లాభాల బాట ప‌ట్టించేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.