మిస్త్రీ.. దెబ్బ‌కి టాటా కొంప ఖొల్లాస్‌!

సైర‌స్ ప‌ల్లోంజీ మిస్త్రీ! కొన్నాళ్లుగా మీడియాలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు. నిన్న గాక మొన్న ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత టాటా సంస్థ ఆయ‌న‌కు చుక్క‌లు చూపించింది. ఉన్న‌ప‌ళాన టాటా సంస్థ‌ల‌  6వ చైర్మ‌న్‌గా ఉన్న  ఆయ‌న‌ను  ఆ ప‌ద‌వి నుంచి ఊడ‌బెరికి భారీ షాక్ ఇచ్చింది. ఎందుకు ఆ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తుందో కూడా క‌నీసం చెప్ప‌లేదు. మ‌న భాష‌లో చెప్పాలంటే.. మా ఇష్టం నిన్ను గెంటేస్తున్నాం. దిక్కున్న‌చోట చెప్పుకో! అంది. ఇది దేశ వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా పెద్ద సంచ‌ల‌నం రేపింది. వాణిజ్య వ‌ర్గాల్లో ఆశ్చ‌ర్యం క‌ట్ట‌లు తెంచుకుంది. క‌నీసం సంజాయిషీ కూడా చెప్పుకునే అవ‌కాశం ఇవ్వ‌రా అన్న సైర‌స్ ఆవేద‌న‌ను ప‌ట్టించుకునే నాథుడే క‌నిపించ‌లేదు. ఇది నిన్న‌టి విష‌యం!!

ఇక‌, ఇప్పుడు.. అదే సైర‌స్ టాటా కి చుక్క‌లు చూపిస్తున్నారు. టాటా లోగుట్టును క‌థ‌లు క‌థ‌లుగా వెల్ల‌డిస్తున్నారు. తెర మాటున జ‌రుగుతున్న‌ది ఏమిటో చెప్పేస్తున్నారు. అంతే! ఇంకేముంది టాటా సామ్రాజ్యంలో పెను క‌ద‌లిక‌! అస‌లేం జ‌రుగుతోందో తెలుసుకునే లోపే పెను ఉప్పెన‌! మార్కెట్ మాట‌ల్లో చెప్పాలంటే సైర‌స్ ఇప్పుడు టాటాల కొంప ముంచేస్తున్నాడు. కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలో సైర‌స్ దెబ్బ‌కి టాటా సంస్థ‌ల‌కి సుమారు 40 వేల కోట్ల న‌ష్టం వాటిల్లిందంటే.. సైర‌స్ ఎంత దెబ్బ కొట్టాడో తెలుస్తోంది.

వారసత్వ సంస్థలను నష్టాల్లో నడుపుతున్న కారణంగా టాటా గ్రూప్ 18 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 1.18 లక్షల కోట్లు) రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుందని సైరస్ మిస్త్రీ చేసిన వ్యాఖ్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పూర్తిగా న‌శించింది. అంతే, ఒక్క‌రొక్క‌రుగా కాకుండా మూకుమ్మ‌డిగా త‌మ పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకుంటున్నారు. వీటిని కొనేవారు లేక పోవ‌డంతో టాటా పవర్, టాటా కమ్యూనికేషన్స్, టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బీవరేజస్, టాటా కాఫీ, టాటా ఇన్వెస్ట్ మెంట్స్ కార్పొరేషన్, టాటా టెలీ సర్వీసెస్, టాటా మెటాలిక్స్, టాటా స్పాంజ్ అండ్ ఐరన్ కంపెనీలు నేడు 5 నుంచి 13 శాతం న‌ష్టం వాటిల్లింది ఫ‌లితంగా ఈ రెండు రోజుల్లోనే టాటా 40 వేల కోట్ల సొమ్మును హార‌తిలా క‌రిగించేయాల్సి వ‌చ్చింది.  మ‌రి దీనిని త‌ట్టుకునేందుకు టాటా ఎలా ముందుకెళ్తుందో చూడాలి.