కేసీఆర్ ముందా వాళ్ల కుప్పిగంతులు

వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ అధినేత కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుది విభిన్న‌శైలి. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను.. ఎవ‌రూ ఊహించ‌లేని ఎత్తుల‌తో చిత్తు చేయ‌డ‌మే కాదు. ప‌రిపాల‌న‌లోనూ ఆయ‌న త‌న‌దైన మార్కును చూపేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. అది ఏ అంశ‌మైనా స‌రే… సాధ్యాసాధ్యాలకు ఆయ‌న నిఘంటువులో అర్థాలు వేరుగా ఉంటాయి.  ఆయ‌న పాల‌నా ప‌రంగా ఏ నిర్ణ‌యం తీసుకున్నా అందులో పార్టీకి భ‌విష్య‌త్తులో అనుకూలించే వ్యూహాలు అంత‌ర్లీనంగా దాగి ఉంటాయి.

తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా పీఠాన్ని అధిష్టించిన త‌రువాత కేసీఆర్ తీసుకున్న పెద్ద నిర్ణ‌యాల్లో ఒక‌టి జిల్లాల సంఖ్య‌ను పెంచ‌డం. దీంతో ఆయ‌న భారీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలనే ఆశిస్తున్నార‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. విప‌క్షాల విమ‌ర్శ‌ల ఎలా ఉన్నా.. ఈ అంశంలో ఆయ‌న దూకుడుగా వెళ్లేందుకే నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుత‌ జిల్లాల విభ‌జ‌న‌కు, కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కొత్త జిల్లాల ప్రక‌ట‌న త‌ర్వాత.. ప‌లు ప్రాంతాల నుంచి మ‌రిన్ని డిమాండ్లు త‌లెత్త‌డం చూస్తే ఈ వ్య‌వ‌హారం తెనెతుట్ట‌ను క‌ద‌ప‌డం మాదిరిగానే క‌నిపిస్తోంది.

ఇదే అంశంపై గ‌ద్వాలను ప్ర‌త్యేక జిల్లాను చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మ‌ల్యే, ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు డీకే అరుణ ఏకంగా ఎమ్మ‌ల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌రీ ఉద్య‌మించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అలాగే సిరిసిల్ల‌, జ‌న‌గామల‌ను జిల్లాలుగా ప్ర‌క‌టించాల‌ని ఆ ప్రాంతాల్లోనూ డిమాండ్ ఊపందుకుంది. ఈ ప్రాంత ప్ర‌జ‌ల డిమాండ్ల‌ను ప‌క్క‌న పెడితే రాజ‌కీయంగా న‌ష్టం త‌ప్ప‌ద‌న్న నిర్ణ‌యానికొచ్చిన కేసీఆర్ లో వెంట‌నే చురుకు పుట్టింది.  కొత్త జిల్లాల ఏర్పాటుపై టీఆర్ ఎస్ మంత్రులు.. ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయిలో భేటీ నిర్వహించిన ఆయన… కొత్త జిల్లాలపై  ప్రాంతాల వారీగా ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించారు. అంతేకాదు.. కొత్త జిల్లాల ఏర్పాటు త‌న పార్టీకి ఉప‌యోగప‌డాల‌ని, అదే స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థుల వ్యూహాల‌కు ఆదిలోనే అడ్డుక‌ట్ట వేయాల‌న్న నిర్ణ‌యానికొచ్చేశారు.  ప్రజలు కోరుకుంటున్నట్లుగా గద్వాల,సిరిసిల్ల, జనగామ కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే విషయాన్నిగట్టిగానే ప‌రిశీలిస్తున్నామ‌ని తాజాగా చెప్పేశారు కేసీఆర్.

అంటే తెలంగాణలో ఏర్పాట‌య్యే కొత్త జిల్లాల సంఖ్య ఏకంగా 20కి, మొత్తం జిల్లాల సంఖ్య 30కి చేరనుంద‌న్న‌మాట‌.  అయితే అదంత వీజీ కాదు క‌దా..?  కొత్త జిల్లాల ఏర్పాటుకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలి కదా?  మ‌రికొన్ని కొత్త జిల్లాలంటే మ‌ళ్లీ క‌స‌ర‌త్తు షురూ చేయాల్సిందే క‌దా..?  దానికి వ్య‌వ‌ధి స‌రిపోతుందా…?  లాంటి  అనుమానాలు  సొంత పార్టీ నేతల నుంచే వెలువ‌డ‌టంతో… టీ ముఖ్యమంత్రి….వాటి సంగతి తాను చూసుకుంటానని , నోటిఫికేషన్ మళ్లీ జారీ చేయాల్సిన అవసరం లేదని..  అధికారులతో మాట్లాడతానని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ అంశాన్ని రాజ‌కీయంగా బ‌ల‌ప‌డేందుకు వినియోగించుకోవాల‌న్న‌విప‌క్షాల ప్ర‌య‌త్నాల‌కు కేసీఆర్ ఆదిలోనే చెక్ పెట్టేశార‌న్న‌మాట‌.  తెలంగాణ ఇచ్చిందీ మేమే.. తెచ్చింది మేమే.. అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీనే ఆ రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడేలా చేస్తున్న టీఆర్ఎస్ అధినేత.. రాజ‌కీయ వ్యూహాల‌ముందు ఇలాంటి కుప్పిగంతులతో ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌నే చెప్పాలేమో…