కేసీఆర్ మీద సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు

కొత్త జిల్లాల ఏర్పాటు అంశం.. మొత్తం మీద తెలంగాణ సీఎం కేసీఆర్ కు శిరోభారంగా మారిన‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు మైలేజీ రాకుండా చేయాల‌న్న ఉద్దేశంతో.. వారి డిమాండ్ల‌నూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కొత్త జిల్లాల సంఖ్య‌ను టీఆర్ ఎస్ అధినేత తాజాగా ఏకంగా 21కి చేర్చారు. అయినా ఈ అంశం రోజుకో వివాదాన్ని రాజేస్తూనే ఉంది.

కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర‌  మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను ప్ర‌త్యేక‌ జిల్లాగా చేయాలనే డిమాండ్‌తో  మొదలైన ఈ రగడ వరంగల్ జిల్లాలోని జనగామను, మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ ను కూడా జిల్లాలుగా  ఏర్పాటు చేయాలంటూ ప్ర‌జ‌ల నుంచి ఆందోళనలు చెలరేగే ద‌శ‌కు  వెళ్లిపోయింది. ఇక  విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణ గద్వాల్ ను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తూ స‌ర్కార్‌పై గ‌ట్టి అస్త్రాన్నే సంధించారు.

కాగా సిరిసిల్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ  స్థానిక నేత‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ప‌రిస్థితి తీవ్ర‌త‌ను గ‌మ‌నించిన టీ ముఖ్య‌మంత్రి 21 కొత్త జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ లను జిల్లాలుగా చేయడంతోపాటు ఎంఐఎం అధినేత ఒవైసీ సూచనల‌ ప్రకారం వికారాబాద్ పేరును కొనసాగించేందుకు కేసీఆర్ అంగీక‌రించారు.

అయితే ఇక్క‌డితో స‌మ‌స్య ముగిసిపోయింద‌నుకుంటే పొర‌పాటు.. ఇప్పుడే అస‌లు స‌మ‌స్య మొద‌ల‌యిన‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా మ‌రో ఎమ్మెల్యే…  త‌న నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా మ‌రో జిల్లా ఏర్పాటును కోరుతూ డీకే అరుణ బాట‌లో రాజీనామా చేసేందుకు సిద్ధ‌మంటూ ప్ర‌క‌టించ‌డం తాజా విశేషం. ఇక్క‌డ విశేష‌మేమిటంటే అత‌డెవ‌రో విప‌క్ష ఎమ్మెల్యే అనుకుంటే పొర‌పాటు. అధికార‌ టీఆర్ఎస్ ప‌క్షంలోనే ఉన్నఎమ్మెల్యే కావ‌డ‌మే ఇక్క‌డ ట్విస్ట్‌. మహబూబ్ నగర్ జిల్లా నారాయరణ్ పేట్ నుంచి  టీడీపీ త‌ర‌పున‌ ఎమ్మెల్యేగా గెలిచిన‌ రాజేందర్ రెడ్డి అనంత‌ర కాలంలో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి కారెక్కేసి., కేసీఆర్ కి విధేయుడిగా మారిపోయారు.

ఇప్ప‌టిదాకా జిల్లాల ఏర్పాటు అంశంలో సైలెంట్ గా ఉన్న ఆయన తాజాగా  నారాయణపేట ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని ఒక్క‌సారిగా డిమాండ్ అందుకోవ‌డం  కేసీఆర్‌కు త‌ల‌నొప్పి తెప్పిస్తోంది.  ప్ర‌త్యేక‌ జిల్లాగా ఏర్పాటుకు కావ‌ల‌సిన  అన్నిలక్షణాలూ నారాయణపేటకు  ఉన్నాయని రాజేంద‌ర్‌రెడ్డి గ‌ట్టిగానే చెబుతున్నారు. ఈ డిమాండ్ కోసం అవసరమైతే త‌న‌ తన పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయ‌న‌ ప్రకటించారు. అంటే ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్లు స‌మ‌యం ఉండ‌గానే సొంత బ‌లం పెంచుకునేందుకు, ఎమ్మెల్యేలు త‌మ స్వీయ‌ అజెండాల‌ను అమ‌లు ప‌ర‌చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.  అదే నిజ‌మైతే ఇదే ర‌క‌మైన మ‌రిన్ని డిమాండ్లు త‌లెత్తే అవ‌కాశాలనూ తోసిపుచ్చ‌లేం. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై కేసీఆర్ త‌దుప‌రి చ‌ర్య‌లెలా ఉంటాయోన‌న్న‌ది ఆస‌క్తిక‌రంగానే క‌నిపిస్తోంది.