ఏపి లో మంత్రి గారి అల్లుడు గిల్లుడు..!

ఏపీలోని రోడ్లు భ‌వ‌నాల శాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌గా మారింద‌నే విమ‌ర్శ‌లు జోరందుకున్నాయి. సాక్షాత్తూ ఓ మంత్రిగారి అల్లుడు రంగంలోకి దిగిపోయి.. నాక‌ది.. నీకిది త‌ర‌హాలో అధికారుల‌ను లోబ‌రుచుకుని ప‌క్కాగా ప్ర‌జ‌ల సొమ్మును బొక్కేస్తున్న విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఏపీలోని అన్ని ర‌హ‌దారుల‌ను అద్దంలా త‌యారు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు ప్లాన్ వేశారు. ఫ‌లితంగా దేశ‌, విదేశీ పెట్టుబ‌డి దారుల‌ను ఆక‌ర్షించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం జ‌రుగుతోంది. అయితే, రోడ్ల నిర్మాణం అనంత‌రం, వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు రోడ్ల‌పై మార్జిన్లు, మార్కింగ్‌లు, సిగ్న‌ల్ బోర్డులు త‌ప్ప‌నిస‌రి!

వీటిని ఏర్పాటు చేయ‌డం అనేది పైకి చిన్న‌దిగానే క‌నిపిస్తున్నా.. దీనికి పెద్ద ఎత్తున ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేస్తుంది. దీంతో ఆర్ అండ్ బీ శాఖ‌ను చూస్తున్న మంత్రి గారి అల్లుడి క‌న్ను ఈ ప‌నుల‌పై ప‌డింద‌ట‌. వీటిలో ఎంత బొక్కేసినా ప‌ట్టించుకునే నాథుడు ఉండ‌డ‌ని భావించి.. ఆయా ప‌నుల‌ను త‌నకే చెందిన ఓ బినామీ కంపెనీకి ద‌క్కేలా ప్లాన్ వేశారు. దీనికి ఆర్ అండ్ బీలోని ఓ అత్యున్న‌త స్థాయి అధికారి సాయం తీసుకున్నారు. ఈ అధికారం మాత్రం త‌క్కువ తిన్నాడా? అంటే అదేం లేదు. ఆయ‌న కూడా ఆమ్యామ్యా బాప‌తే! దీంతో నువ్వు నాకు ఆ కాంట్రాక్టు ద‌క్కేలా చూస్తే.. నువ్వు ఎంత తిన్నా ఎవ‌రూ ఏమీ అన‌కుండా కాపాడే బాధ్య‌త నాది అని ఈ అల్లుడు గారికి, ఆ అధికారి గారికి మ‌ధ్య పెద్ద ఒప్పందం కుదిరిన‌ట్టు తెలుస్తోంది.

ఇంకేముంది. స‌ద‌రు అధికారి.. రోడ్ల‌పై మార్జిన్ వేసే ప‌నుల‌ను మంత్రి అల్లుడి బినామీ కంపెనీకి ద‌క్కేలా చక్రం తిప్ప‌డంతోపాటు.. ఆయా ప‌నుల‌కు ప్ర‌భుత్వం గ‌రిష్టంగా ఇచ్చే మొత్తాన్ని అందేలా చ‌ర్య‌లు తీసుకున్నార‌ని ఆర్ అండ్ బీ ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు. తారు రోడ్లపై ఒక్కో స్క్వేర్ మీటర్ కు మార్కింగ్ వేసినందుకు కనిష్టంగా 450 రూపాయల నుంచి గరిష్టంగా 700 రూపాయల వరకూ చెల్లిస్తారు. అందులో మంత్రి అల్లుడి కంపెనీ రంగంలో ఉండటంతో సహజంగానే గరిష్ట రేటే పలుకుతుంది. ఇఛ్చేవారు కూడా మారు మాట్లాడకుండా ఇచ్చేస్తున్నారు. ఇలా మంత్రి అల్లుడి దందా మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతుంటే..ఆ ఇంజనీరింగ్ ఉన్నతాధికారి అక్రమాల దందా కూడా అంతే జోరుగా సాగుతోంది. ఇదందీ.. ఆర్ అండ్ బీలో మంత్రి అల్లుడి గారి గిల్లుడు క‌హానీ!! ఈ విష‌యం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.