హాలీవుడ్‌ హీరోలా ఉన్నాడు ‘గురూ’.

విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం ‘గురు’పై అంచనాలు ఆకాశాన్నంటేశాయి. ఒక్కటంటే ఒక్క స్టిల్‌తో సినిమాపై అంచనాలు పెంచేశాడు విక్టరీ వెంకటేష్‌. అదే అతని స్పెషాలిటీ. సినిమా సినిమాకీ వేరియేషన్స్‌ చూపడంలో ఈ సీనియర్‌ హీరో ప్రత్యేకతే వేరు. వెంకీ గత నాలుగైదు చిత్రాలు తీసుకుంటే ఆయన ఎంతగా విలక్షణత వైపు మొగ్గు చూపుతాడో అర్థమవుతుంది. ‘షాడో’, ‘గోపాల గోపాల’, ‘దృశ్యం’, ‘బాబు బంగారం’ దేనికదే అన్నట్లుగా ఉంటాయి విభిన్నత పరంగా. ఇప్పుడు చేస్తున్న ‘గురు’ ఇంకా భిన్నమైనది. సినిమా చేస్తే అందులో హీరోయిన్‌తో రొమాన్స్‌ ఉండాలి, డ్యూయట్లు ఉండాలనే సమీకరణాల్ని పక్కన పెట్టి కొత్తదనంతో కూడిన సినిమాలు చేయడంపైనే దృష్టిపెట్టాడు వెంకీ.

అలా వెంకీ నుంచి రానున్న విభిన్న చిత్రంగా ‘గురు’ గురించి చెప్పవచ్చు. బాలీవుడ్‌లో మాధవన్‌ ప్రముఖ పాత్ర పోషింగా వచ్చిన ‘సాలా ఖదూస్‌’ సినిమాని ‘గురు’గా వెంకీ రీమేక్‌ చేయడం జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలయిన వెంటనే వెంకీ ఫాన్స్‌ మాత్రమే కాదు, సినీ అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారు. వెంకీ సింపుల్‌గా సూపర్బ్‌ అనేలా ఉన్నాడనీ, హాలీవుడ్‌ హీరోని తలపిస్తున్నాడని అంటున్నారు. ‘సాలా ఖదూస్‌’ సినిమాలో నటించిన రితికా సింగ్‌ ఈ సినిమాలోనూ నటిస్తోంది. రీమేక్‌ సినిమాలతో ఎన్నో సెన్సేషనల్‌ హిట్స్‌ అందుకున్న వెంకీ, ఈ సినిమాతోనూ మరోసారి ఆ స్థాయి విజయాన్ని అందుకోవడం ఖాయమే.