సూపర్‌ స్టార్‌ ‘కింగ్‌’లాగున్నాడు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఎలా ఉన్నాడనే అంశానికి సంబంధించి అభిమానుల్లో ఆందోళన ఉంది. ‘కబాలి’ సినిమా సందర్భంగా ఆయన అనారోగ్యానికి గురై, విదేశాల్లో చికిత్స పొంది వచ్చారు. అనంతరం ఆయన్ని అభిమానులు కలుస్తున్నారుగానీ, తమ అభిమాన హీరో ఎలా ఉన్నారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే సూపర్‌స్టార్‌కి అత్యంత సన్నిహితుడైన టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు, తన మిత్రుడ్ని కలుసుకుని, అతనితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. రజనీకాంత్‌ కింగులాగున్నాడంటూ ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు అందించారు మోహన్‌బాబు. మోహన్‌బాబుతో కలిసి హుషారుగా రజనీకాంత్‌ ఫొటోలకు పోజులివ్వడంతో రజనీకాంత్‌ అభిమానుల్లో టెన్షన్‌ తగ్గింది.

 రజనీకాంత్‌, ‘రోబో-2.0’ సినిమాలో నటిస్తున్నారిప్పుడు. ‘కబాలి’ సినిమా ఫలితం ఎలా ఉన్నా, ‘రోబో 2.0’తో రజనీకాంత్‌ ఈజ్‌ బ్యాక్‌ అనే ధీమా అభిమానుల్లో కనిపిస్తోంది. ఎందుకంటే ఈ చిత్రానికి శంకర్‌ దర్శకుడు. ‘రోబో 2.0’ సినిమా కోసం కొన్ని రిస్కీ షాట్స్‌ కూడా రజనీకాంత్‌ చెయ్యబోతున్నారట. ‘కబాలి’ సినిమా టైమ్‌లో అనారోగ్యం ఏమీ కాదనీ, సినిమా పూర్తయ్యాక జనరల్‌ చెకప్‌ కోసమే రజనీకాంత్‌ విదేశాలకు వెళ్ళారని తాజాగా రజనీకాంత్‌ కాంపౌండ్‌ నుంచి సమాచారమ్‌ అందుతోంది. ఏదేమైనా సూపర్‌ స్టార్‌ కింగులా ఉన్నాడంటే అభిమానులకి ఆనందమే కదా.