మెగా ఛాన్స్‌ కొట్టేసిన కృష్ణవంశీ.

చిరంజీవి ప్రస్తుతం 150వ సినిమాలో నటిస్తున్నారు. ‘ఖైదీ నెం.150’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే చిరు కోసం పలు డైరెక్టర్లు తమ తమ స్టైల్లో కథలు రెడీ చేసుకుంటున్నారు. వారిలో ఇప్పుడు క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ కూడా చేరిపోయారు. కృష్ణవంశీ ఇప్పటికే బాలకృష్ణతో 101వ చిత్రం చేయడానికి కమిట్‌ అయ్యారు. ఈ సినిమాకి ‘రైతు’ అనే టైటిల్‌ని కూడా ప్రకటించారు. బాలకృష్ణ ‘శాతకర్ణి’ సినిమా నిర్మాణం అవ్వగానే ఈ సినిమాని సెట్స్‌ మీదికి తీసుకెళ్లనున్నారు. ఈలోగా కృష్ణవంశీ చిరు 151వ చిత్రానికి కూడా ప్లాట్‌ఫాంని సిద్ధం చేసుకున్నారట.

ప్రస్తుతం కృష్ణవంశీ సందీప్‌తో ‘నక్షత్రం’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్నారు. గతంలో కృష్ణవంశీ, చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విజయం సాధించింది. తాజాగా మెగాస్టార్‌తో ఒక మెసేజ్‌ ఓరియెంటెడ్‌ మూవీని తెరకెక్కించాలనుకుంటున్నారట కృష్ణవంశీ. మెగాస్టార్‌ ‘ఖైదీ నెం.150’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తరువాత కృష్ణవంశీతోనే చిరు సినిమా తెరకెక్కడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. మరో పక్క పూరీ జగన్నాధ్‌ కూడా చిరు 151వ సినిమా కోసం లైన్‌లో ఉన్నారు. అయితే చిరు వీళ్లలో ఎవరికి ఛాన్స్‌ ఇస్తారో చూడాలి.