ఆ మాజీ కేంద్ర మంత్రి దారెటు

కేంద్ర మాజీ మంత్రి, కోట్ల వంశం రాజ‌కీయ వార‌సుడు, క‌ర్నూలు కాంగ్రెస్ నేత కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి పొలిటిల్ ఫ్యూచ‌ర్‌పై ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది! వాస్త‌వానికి కోట్ల కుటుంబం పొలిటిక‌ల్ హిస్ట‌రీ ఇప్ప‌టిది కాదు. కోట్ల విజ‌య‌భాస్క‌ర రెడ్డి నుంచి కర్నూలు స‌హా స్టేట్ పాలిటిక్స్‌లో కోట్ల కుటుంబం యాక్టివ్‌గా ఉంది. ఈ క్ర‌మంలోనే సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి యూపీఏ ప్ర‌భుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఇక‌, ఆ త‌ర్వాత స్టేట్ డివైడ్ అయిన క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు ఛీ కొట్టిన విష‌యం తెలిసింది. దీంతో కాంగ్రెస్ నుంచి భారీ ఎత్తున వ‌ల‌స‌లు సాగాయి. దీంతో కోట్ల కూడా ప్లేటు ఫిరాయిస్తార‌ని అందరూ భావించారు. కానీ, అలాంటి దేమీ జ‌ర‌గ‌లేదు. అంతేకాదు, ఆయ‌న ఆధ్వ‌ర్యంలో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున ప‌ద‌వులు పొందిన ఆయ‌న శిష్య‌లు కూడా అప్ప‌ట్లో పార్టీ మార‌లేదు.

అయితే, మారిన పొలిటిక‌ల్ సీన్ నేప‌థ్యంలో 2019లోనూ స్టేట్‌లో కాంగ్రెస్ పుంజుకోవ‌డం అంత తేలిక‌కాద‌ని గుర్తించిన ఆయా నేత‌లు.. ఒక్కొక్క‌రుగా అటుటీడీపీ, ఇటు వైకాపాల్లోకి జంప్ చేశారు. ఈ క్ర‌మంలోనే కోట్ల‌కు న‌మ్మిన‌బంటు, అభిమాన శిష్యుడు ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, నంద్యాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రాకేష్‌రెడ్డి కోట్లతో కటీఫ్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో శాసనమండలి సమావేశాల చివరిరోజున ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు.. సీఎం చంద్ర‌బాబుతో భేటీ కూడా అయ్యారు. దీంతో త్వ‌ర‌లోనే ఆయ‌న సైకిల్ ఎక్కేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇక‌, ఇప్పుడు కోట్ల వంతు వ‌చ్చింది. ఈయ‌నకు కూడా అటు టీడీపీ, ఇటు వైకాపా మ‌రోప‌క్క‌, బీజేపీ ల‌నుంచి కూడా ఆఫ‌ర్ల‌మీద ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌!

దీనికి కొంత సొంతింట్లో జ‌రిగిన అవ‌మానాలూ ఉన్నాయంటున్నారు విశ్లేష‌కులు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో కోట్ల త‌ప్ప‌కుండా కాంగ్రెస్‌కి గుడ్‌బై చెబుతార‌ని అంద‌రూ అనుకున్నారు. అదీకాకుండా.. కోట్ల ఎంతో న‌మ్మిన ఆయ‌న శిష్యులు కూడా వ‌రుస పెట్టి పార్టీ మారోపోతున్నారు. కోట్లకు నిత్యం నీడలా వెన్నంటి ఉంటూ, పార్టీ కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉండే సుధాకర్‌బాబు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవటం, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, బి.వై.రామయ్య ఇప్పటికే వైసీపీలో చేరడంపై కోట్లవర్గం తీవ్రంగా కుంగిపోయింది. దీంతో కోట్ల కూడా పార్టీ మార‌తార‌ని,, కాంగ్రెస్‌కి గుడ్‌బై చెబుతార‌ని క‌ర్నూలులో చ‌ర్చ‌సాగుతోంది.

అయితే , కోట్లగానీ, ఆయ‌న స‌తీమ‌ణికానీ కాంగ్రెస్‌ను వీడి వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని మ‌రో వ‌ర్గం అంటోంది. ముఖ్యంగా ఆయ‌న త‌న తండ్రి త‌రం నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నార‌ని అంటున్నారు. దీనిపై కోట్ల కూడా ఓ క్లారిటీతోనే ఉన్నార‌ని అంటున్నారు. పార్టీ ఇప్పుడు క‌ష్టాల్లో ఉంద‌ని ఎలా వ‌దిలి వ‌చ్చేస్తామ‌ని ఆయ‌న త‌న స‌న్నిహితుల వ‌ద్ద కామెంట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. “పార్టీల నుంచి ఆఫర్లు మస్తుగ వస్తుంటాయి. పదవుల కోసం ఆశపడి కాంగ్రెస్‌ను వదులుకునే నైజం కాదు. రెండున్నర ఏళ్ల పాలనలో బీజేపీకి, టీడీపీకి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. కాంగ్రెస్‌పార్టీకి ప్రజాదరణ పెరుగుతోంది. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది అని కొట్ల గ‌త కొన్నాళ్లుగా అంటున్నార‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. అంతేకాదు, త‌న కుమారుడు రాఘ‌వేంద్ర రెడ్డికి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి.. 2019లో అటు అసెంబ్లీకి లేదా పార్ల‌మెంటుకు పంపే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.