స్పీకర్ కు సుప్రీం నోటీసులు

ఒక పార్టీ గుర్తుపై గెలిచి నిస్సుగ్గుగా ఎన్నికల తర్వాత అధికార పార్టీలో చేరుతున్న ప్రజాప్రతినిధులకు గొంతులో వెలక్కాయ పడింది.ఏ స్పీకర్ అండ చూసుకుని రాజకీయంగా చలామణి అవుతున్నారో ఆ స్పీకర్ కి కూడా సుప్రీం నోటీసులిచ్చింది.

ఏముందిలే ఎప్పుడో మళ్ళీ 5 ఏళ్ళకి కదా ఎన్నికలు ఈ లోగా అధికార ముసుగులో రాజకీయం చేసేద్దాం అనుకుని అటు ఆంధ్ర ఇట్లు తెలంగాణాలో చాలామంది ప్రతి పక్ష సభ్యులు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తూ పార్టీ ఫిరాయించేశారు.ఎలాగూ ఫిరాయించినా ఎన్నికలొచ్చే అవకాశం లేదు దానికి అధికార పక్ష శాసన సభా స్పీకర్ అండ ఉందనే ఉంటుంది అన్న ధీమా వీళ్ళందరికీ.

అయితే తాజాగా పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు జరిగి రెండేళ్లవుతున్నా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పీకర్, ఫిరాయించిన ఎమ్మెల్యేలకు జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.