వెరీ వెరీ స్పెషల్‌ చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అంతే, ఆయన ఏం చేసినా అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న బ్యాడ్మింటన్‌ సంచలనం సింధుని విజయవాడకు ఆహ్వానించిన చంద్రబాబు, ఆమెకు సాదర స్వాగతం పలికారు. సన్మాన సభలో చంద్రబాబు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సింధుతో కలిసి వేదికపై కాస్సేపు జరదాగా షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడారు. చూపరుల్ని బాగా ఆకట్టుకున్న విషయమిది. అలాగే సింధుతోపాటు, ఆమె కోచ్‌ గోపీచంద్‌ని కూడా ఘనంగా సన్మానించారు. సింధు గురించి మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు, గోపీచంద్‌ కూడా తన పక్కనే నిల్చోబెట్టుకున్నారు.

అంతే కాకుండా, పతకం తీసుకురాకపోయినా ఒలింపిక్స్‌కి వెళ్ళిన కిదాంబి శ్రీకాంత్‌ని కూడా సన్మానించారు. ఇంకో వైపున చెస్‌ క్రీడాకారిణి కోనేరు హంపిని కూడా ఇదే వేదికపై సన్మానించడం ద్వారా చంద్రబాబు తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పివి సింధు, విజయవాడ తన తాతగారి ఊరని చెప్పింది. చిన్నప్పుడు ఇక్కడే బ్యాడ్మింటన్‌ ఆడినట్లు వివరించింది సింధు. చంద్రబాబు ప్రోత్సాహంతో అకాడమీని స్థాపించానని వివరించిన గోపీచంద్‌, ప్రభుత్వాల ప్రోత్సాహం తమను ముందుకు నడిపిందని అన్నారు. మన బెజవాడ బిడ్డ సింధు, మన ఆంధ్రుల ముద్దుబిడ్డ గోపీచంద్‌ అంటూ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పదే పదే నినదించారు.