వాళ్ళ వేధింపులకు సైనిక ఎస్సై సూసైడ్

మెదక్‌ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లిలో ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి (45) ఆత్మహత్య కలకలం రేపింది. పోలీస్‌ క్వార్టర్స్‌లో ఈ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. రామకృష్ణారెడ్డి గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత పోలీసు శాఖలో చేరి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.

సంఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఎస్‌ఐ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. . డీఎస్పీ శ్రీధర్, సీఐ వెంకటయ్యలు తనను వేధించారని, ఆ వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్మహత్య చేసుకున్నానని ఆ లేఖలో రామకృష్ణారెడ్డి ఆరోపించారు.తాను ఉద్యోగం మానేస్తానని మంగళవారం రాత్రి భార్యకు రామకృష్ణారెడ్డి ఫోన్‌ చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్‌ఐ రామకృష్ణారెడ్డిది నల్లగొండ జిల్లా, మఠంపల్లి మండలం బక్కమంత్రగూడెం స్వస్థలం, ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆత్మహత్యకు ముందు రామకృష్ణారెడ్ది తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనట్లు తెలుస్తోంది. తనను ఉన్నతాధికారులు వేధిస్తున్న వైనాన్ని మననం చేసుకున్న ఆయన… తన కింద పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు ఫోన్ చేసి తన బాధను చెప్పుకున్నారు. ఎస్ఐ మృతదేహాన్ని గజ్వేల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించించారు,