రాజకీయాల్లో సొంతిల్లు, అద్దె ఇల్లు

రాజకీయాలు భలే కామెడీగా ఉంటాయ్‌. రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు చేసే వ్యాఖ్యలు ఇంకా చిత్రంగా ఉంటాయి. చచ్చేదాకా ఫలానా పార్టీలోనే ఉంటానని చెప్పే నాయకులు కూడా మాట తప్పేస్తారు. పైకి మాత్రం మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదంటారు. నేను చనిపోయాక నా పార్తీవ శరీరమ్మీద టీడీపీ జెండానే కప్పబడుతుందని చెప్పిన తమ్మినేని సీతారాం ఎన్నో పార్టీలు మారారు.

రాజకీయ నాయకుల నిబద్ధతకి ఇది నిదర్శనం. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. కొన్ని రాజకీయ కారణాలతో ఆయన కాంగ్రెసు పార్టీలోకి రావడం జరిగింది. ఈ రోజు తిరిగి ఆయన స్వగృహ ప్రవేశం చేశారు. స్వగృహ అంటే తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావడం. టిడిపిలోకి రాగానే, దేవినేని నెహ్రూ కాంగ్రెసు పార్టీని అద్దె ఇల్లుగా మార్చేశారు. అద్దె ఇంట్లోంచి సొంత ఇంట్లోకి వచ్చానని మురిసిపోయారాయన. ‘నాకు తెలుగుదేశం పార్టీ కొత్త కాదుగానీ, నా కొడుకు అవినాష్‌కే కొత్తగా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో’ అని చెప్పారు దేవినేని నెహ్రూ.

తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మార్టే రాజకీయ నాయకులు ప్రజల్ని ఉద్ధరించేయడానికే పార్టీ మారుతున్నట్లు చెప్పడం కూడా పరిపాటిగానే మారింది. కాంగ్రెసు పార్టీకి తండ్రీ కొడుకులిద్దరూ రాజీనామా చేయగా, వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.