మోదుగల హర్ట్ అయ్యార్ట…

రాజ‌కీయాలన్నాక నేత‌లు అల‌గ‌డం, వారిని అధిష్టానం బుజ్జగించ‌డం మామూలే. ఏపీ అధికార పార్టీ టీడీపీలోనూ అలిగే వారి సంఖ్య ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. తాజాగా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి టీడీపీ అధిష్టానంపై అలిగారు. పార్టీలో త‌న‌మాటకు విలువ లేకుండా పోయింద‌ని, త‌న‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదని తెగ ఫీలైపోతున్నారు. ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్న హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సర్ది చెప్పినా మోదుగుల దిగిరాలేద‌ని స‌మాచారం. మ‌రి అంత‌గా ఆయ‌న అల‌గ‌డానికి ఉన్న కార‌ణం ఏంటో చూద్దాం.

గుంటూరు జిల్లాపెదకూరపాడు నియోజకవర్గం నుంచి రెండుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన వెన్నా సాంబశివారెడ్డిపై టీడీపీలో చాలామందికి సానుభూతి ఉంది. మోదుగుల‌కు ఈయ‌న అత్యంత స‌హ‌చ‌రుడు కూడా. దీంతో ఈయ‌న‌ను పార్టీలో త‌న ప‌లుకుబ‌డి ఉప‌యోగించి జిల్లాలో ఒక ప‌ద‌విలో నియ‌మించాల‌ని మోదుగుల భావించారు. ఈ క్ర‌మంలోనే ఆసియాలోనే పెద్ద‌దైన గుంటూరు మిర్చియార్డుకు సాంబ‌శివారెడ్డిని చైర్మ‌న్‌ను చేయాలంటూ.. మోదుగుల పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేశారు. అయితే, ఈయ‌న విజ్ఞ‌ప్తిని బుట్ట‌దాఖ‌లు చేసిన అధిష్టానం.. ఈ ప‌ద‌విని మన్నవ సుబ్బారావుకు అప్పగించింది. దీంతో మోదుగుల అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పార్టీలో నామాట‌కు విలువ లేదంటూ.. త‌న అనుచ‌రుల వ‌ద్ద తీవ్రంగా బాధ‌ప‌డ్డార‌ట‌.ఇంత‌లో.. మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్ల పదవుల కోసం పేర్లు ఇవ్వాల్సిందిగా యార్డ్‌ పరిధిలోని ఎమ్మెల్యేలను హైకమాండ్‌ పదేపదే కోరింది.

మోదుగుల కూడా మార్కెట్ యార్డు ప‌రిధిలోని ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ.. డైరెక్ట‌ర్ల పేరును సిఫార్సు చేయ‌లేదు. దీనికి సంబంధించిన గ‌డువు కూడా గ‌త నెల 30తో తీరిపోయింది. ఈ క్ర‌మంలో మోదుగుల చైర్మ‌న్ విష‌యంలోనే నా మాట‌కు విలువ లేన‌ప్పుడు డైరెక్ట‌ర్ విష‌యంలో మాత్రం నా మాట ఎందుకు అని అలిగి కూర్చున్నార‌ట‌. తాను చెప్పిన అధికారిని సీఐగా కూడా నియమించలేదని నిరసన వ్యక్తం చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండంటూ అలకబూనారని టాక్‌. ఈ విష‌యంలో ఇన్‌చార్జ్ మంత్రి చిన‌రాజ‌ప్ప చెప్పినా మోదుగుల మాత్రం అల‌క వీడ‌లేద‌ని స‌మాచారం.