మాట తప్పను మడమ తిప్పను: పవన్‌

‘ఇంకో పాతికేళ్ళపాటు ప్రజల కోసం పోరాడతాను..’ అని జనసేన అధిపతి పవన్‌కళ్యాణ్‌, తిరుపతి వేదికగా నినదించారు. కేంద్రానికి సీమాంధ్రుల సత్తా ఏంటో చూపిస్తేగానీ, ప్రత్యేక హోదా వచ్చేలా లేదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో తిరుపతి వేదికగా నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం దారుణమని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కి ఓటేయలేం, ఉన్నది ఒకటే అవకాశం అదే భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీని కూడా నమ్మి మోసపోయాం’ అని చెప్పిన పవన్‌, మోడీ మీద తనకు గౌరవం ఉన్నా సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేంత గౌరవం మాత్రం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అంటే బ్రహ్మరాక్షసి కాదు కదా, మనుషులే కదా, కేంద్రంపై చంద్రబాబు ఎందుకు అంత భయపడుతున్నారని ప్రశ్నించారు పవన్‌కళ్యాణ్‌.

ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదని పవన్‌ స్పష్టం చేశారు. అధికార రాజకీయాలకు తాను దూరమని చెబుతూ సీమాంధ్రుల సహనాన్ని చేతకానితనంగా భావింవచ్చవద్దని అన్ని రాజకీయ పార్టీలకూ విజ్ఞప్తి చేస్తున్నానని పవన్‌కళ్యాణ్‌ అన్నారు. అభిమాని వినోద్‌ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఈ సందర్భంగా పవన్‌ చెప్పారు.