పవన్‌ – అభిమానమా? రాజకీయమా?

పవన్‌కళ్యాణ్‌ తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం మైదానాన్ని ఇప్పటికే ఎంచుకోగా, ఆ మైదానం పవన్‌ అభిమానులకు సరిపోతుందా? అన్న అనుమానాలున్నాయి. పోలీసు సిబ్బంది, తగినంత ఫోర్స్‌ లేకపోవడంతో సభకు అనుమతి విషయంలో మల్లగుల్లాలు పడింది. అయితే తమ వాలంటీర్లు సభను సజావుగా నిర్వహించేందుకు సహకరిస్తారని పవన్‌ చేసిన సూచనతో పోలీసులు సభకు అనుమతిచ్చారు.

ఎలాగూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పవన్‌కళ్యాణ్‌ ‘మిత్రపక్షం’ కావడంతో సభకు ఇలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. అయితే అకస్మాత్తుగా పవన్‌కళ్యాణ్‌ బహిరంగ సభ ఎందుకు నిర్వహిస్తున్నారో తెలియరావడంలేదు. తిరుపతికి చెందిన అభిమాని వినోద్‌ రాయల్‌, కర్నాటకలో హత్యకు గురికావడంతో ఆ అభిమానికి ఘన నివాళి అర్పించేందుకు సభను ఏర్పాటు చేస్తున్నారా? లేదంటే, రాజకీయాలపై ఈ బహిరంగ సభ ద్వారా కీలకమైన వ్యాఖ్యలు పవన్‌ చేస్తారా? అనే అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏదేమైనా తిరుపతిలో పవన్‌కళ్యాణ్‌ బహిరంగ సభ నిర్వహిస్తుండడం సినీ, రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. పవన్‌కళ్యాణ్‌ తిరుపతిని వేదికగా ఇవ్వబోయే మెసేజ్‌ ఎలా ఉంటుందో చూడాలిక.