డ్యామిట్‌, ఇలా ఎందుకయ్యింది?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, హైకోర్టులో నేడు తమ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలు కొట్టివేయడం పట్ల అసహనంతో ఉన్నారని సమాచారమ్‌. ఏ ప్రభుత్వమైనా హైకోర్టు నుంచి ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు షాక్‌కి గురవడం మామూలే. పాలనా పరంగా తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి వివాదాస్పదమవుతుంది.

న్యాయస్థానాల జోక్యంతో తాము జారీ చేసిన జీవోలని వెనక్కి తీసుకోవడం, సవరించుకోవడం మామూలే. అయినప్పటికీ తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా వేలాది, లక్షలాది ఎకరాలకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి ఈ రకంగా అడ్డంకులు రావడంతో కెసియార్‌ పరిస్థితుల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడ సమన్వయ లోపం జరిగిందో తెలుసుకోవాలని మంత్రి హరీష్‌రావుని కెసియార్‌ ఆదేశించినట్లు సమాచారమ్‌. నీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్‌రావే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఏ ప్రాజెక్టు కట్టాలన్నా సరే కొంత భూభాగం ముంపునకు గురికాక తప్పదు. కానీ అలా ముంపునకు గురయ్యే ప్రాంతంలో నివసిస్తున్నవారిని ఒప్పించడంలోనే పాలకుల గొప్పతనం ఆధారపడి ఉంటుంది. అయితే విపక్షాల ఆందోళనలతోనే నిర్వాసితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని కెసియార్‌ ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఏదేమైనప్పటికీ అప్పీల్‌కి వెళ్ళడం అనే అవకాశం ఉన్నందున, ఈలోగా పరిస్థితుల్ని సమీక్షించే పనిలో కెసియార్‌ బిజీగా ఉన్నారు