ఆ కాశ్మీర్‌ని తీసుకొస్తే మోడీ ధన్యుడే

పాకిస్తాన్‌ ఆక్రమించుకున్న కాశ్మీర్‌ని తిరిగి భారతదేశంలోకి తీసుకురావాలనే మహా సంకల్పంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టిపెట్టారు. అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై నరేంద్రమోడీ చర్చించడం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా ఆ భూభాగం, పాకిస్తాన్‌ ఆధీనంలో ఉంది. అక్కడ పాకిస్తాన్‌ సైన్యాలు యధేచ్ఛగా తిరుగుతాయి. అక్కడి ప్రజల్ని నాశనం చేస్తుంటాయి. అక్కడే తీవ్రవాదుల స్థావరాల్ని నెలకొల్పుతుంటాయి.

కానీ అంతర్జాతీయ సమాజం ఏమనుకుంటుందోననే భయంతో ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్‌తో సంబందం లేని ప్రాంతంగానే చూపుతుంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్‌ పప్పులు ఉడికేలా కనిపించడంలేదు. భారతదేశం ఈసారి కయ్యానికి కాలు దువ్వితే పాకిస్తాన్‌, ఖచ్చితంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ని వదులుకోక తప్పదు. అయితే చైనా నుంచి తమకు మద్దతు ఉంటుందనే ధైర్యం పాకిస్తాన్‌ది. చైనాతో సంప్రదింపులు జరిపి, అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ తీరుని ప్రశ్నించి, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌పై చర్యలకు నరేంద్రమోడీ సర్కార్‌ దిగితే గనక, ఆ భూభాగం తిరిగి భారతదేశంలో కలవడానికి ఆస్కారముంటుంది.

కానీ అది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం. కార్గిల్‌ యుద్ధానికే భారత్‌ ఎంతో కష్టపడవలసి వచ్చింది. పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తే తప్ప పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ని తిరిగి భారతదేశంలో కలపడానికి వీలు కాదు. ఒకవేళ జరిగితే మాత్రం నరేంద్రమోడీ చరిత్రలో నిలిచిపోతారు.