సవాల్ విసురుతున్న ‘బాహుబలి’ బెంచ్‌ మార్క్‌ 

‘సుల్తాన్‌’ సినిమా ‘బాహుబలి’ని దాటుతుందా? ‘కబాలి’ సినిమా ‘బాహుబలి’ రికార్డుల్ని చెరిపేయొచ్చు. ‘మొహంజదారో’ సినిమా వస్తే ‘బాహుబలి’ రికార్డులు గల్లంతే. ఇలాంటి మాటల్ని బాలీవుడ్‌ నుంచి, కోలీవుడ్‌ నుంచీ గట్టిగా వింటున్నాం. తెలుగు సినీ పరిశ్రమ గర్వపడాల్సిన విషయం ఇది. ఓ తెలుగు సినిమా, బాలీవుడ్‌కి వసూళ్ళ పరంగా బెంచ్‌ మార్క్‌ని సెట్‌ చేయడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది?

‘బాహుబలి’ రికార్డుల్ని ఇప్పట్లో ఏ చిత్రమైనా దాటుతుందో లేదోగానీ ఒకవేళ దాటినా ‘బాహుబలి’ రెండో పార్ట్‌ వచ్చేస్తోంది కదా, ఇంకో బెంచ్‌ మార్క్‌కి ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ప్రిపేర్‌ అయిపోవచ్చు నిర్మొహమాటంగా. రాజమౌళి విజువల్‌ ఎఫెక్ట్స్‌ని హైలెట్‌ చేస్తూ అంతంత మాత్రంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా అనూహ్యంగా ప్రపంచ కీర్తి ని దక్కించుకుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం అదే క్యూరియాసిటీతో రెండో పార్ట్‌ కోసం ఎదురు చూస్తూ ఉంది.

మొదటి పార్ట్‌ క్రియేట్‌ చేసిన హైప్‌తో రెండో పార్ట్‌ని తెరకెక్కిచడం రాజమౌళికి చాలా కష్టమైన పనే అయ్యింది. అంతకు మించి అన్న రేంజ్‌లో ఈ రెండో పార్ట్‌ని తెరకెక్కించడానికి ఇంతవరకూ తెలుగు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్‌ పడని కష్టం పడుతున్నాడు రాజమౌళి. మరి ఈ కష్టానిక వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో చూడాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. కేవలం తెలుగు పరిశ్రమే కాదు ప్రపంచ సినీ పరిశ్రమ అంతా. అయితే ఈలోగా ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టే రేంజ్‌ ఉన్న సినిమాలు ఇంకేమీ రావని ఆశిద్దాం.