రాశి రాక్షస కోరికేంటో తెలుసా?

రాశీ ఖన్నా బొద్దుగా ముద్దుగా ఉండే అందాల బొమ్మ. ఆమె మేకప్‌ వేసుకుని అందమైన కాస్ట్యూమ్స్‌తో యూత్‌ని అలరించేలా ఉంటేనే అందరికీ ఇష్టంగా ఉంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మకి దయ్యంలా నటించాలనుందట. ఈ మధ్య హారర్‌ మూవీస్‌కి బాగా క్రేజ్‌ పెరిగింది. దయ్యం పాత్రల్లో ఇదివరకూ అంతగా క్రేజ్‌ లేని వాళ్లే కనిపించేవారు. వారితో బాధించబడే హీరోయిన్‌ పాత్రల్లో పాపులర్‌ నటీమణులు నటించేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. విలక్షణకు పెద్ద పీట వేస్తున్నారు ఆటు ఆర్టిస్టులు, ఇటు ఆడియన్స్‌ కూడా. అందుకే అందమైన ముద్దుగుమ్మలు కూడా దయ్యం గెటప్స్‌లో వావ్‌ అనిపిస్తున్నారు. హన్సిక, త్రిష, స్వాతి, నయనతారా ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు గ్లామర్‌ దయ్యాల్లా కనిపిస్తున్నారు. దయ్యం అంటే భయంకరమైన మేకప్‌ వేసుకోవడమే కాదు, అందంగా కనిపిస్తూ కూడా భయపెట్టొచ్చు అని నేటి ముద్దుగుమ్మలు నిరూపిస్తున్నారు.

అదే కోవలో రాశీ ఖన్నా కూడా చేరాలనుకుంటుందట. ఒక్క సినిమాలో అయినా దయ్యం గెటప్‌లో కనిపించాలని ఉందంటోంది ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఛాలెంజింగ్‌ క్యారెక్టర్స్‌లో నటిస్తేనే నటన పట్ల మరింత ఇంట్రెస్ట్‌ పెరుతుందంటోంది ఈ ముద్దుగుమ్మ. అనుకోకుండా హీరోయిన్‌ అయిపోయినా, కానీ రాశీఖన్నాకి ఈ రంగంలోకి వచ్చాక దీంట్లో ఏదో సాధించాలి, కేవలం అందాల ఆరబోసే హీరోయిన్‌ పాత్రలకే పరిమితం అయిపోకుండా, నటిగా గుర్తింపు వచ్చే ఏ పాత్రకైనా ఓకే అనాలి. అప్పుడే నటిగా సంపూర్ణమైన గుర్తింపు పొందగలం అని ముద్దుముద్దుగా చెబుతోంది రాశీఖన్నా.