మేడమ్‌కి మోడీ షాక్‌లే షాక్‌లు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మానవ వనరుల శాఖ మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించిన మోడీ, ఆమెకు తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నుంచి ఉద్వాసన పలికారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఏ కమిటీల్లోనూ స్మృతి ఇరానీకి చోటు కల్పించలేదు నరేంద్రమోడీ.

ఒకానొక సమయంలో కేంద్ర క్యాబినెట్‌లో స్మృతి ఇరానీ అత్యంత కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య ఘటన, ఆ సమయంలో స్మృతి ఇరానీ వ్యవహరించిన తీరుతో నరేంద్రమోడీ అసహనానికి గురయ్యారు. ఆమె కారణంగా తన ప్రభుత్వానికీ అలాగే భారతీయ జనతా పార్టీకీ మచ్చ వచ్చిందని మోడీ భావించారు.

అయితే మహిళా మంత్రిని కేంద్ర క్యాబినెట్‌ నుంచి తొలగించడం ద్వారా తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశ్యంతో ఆమెను అలాగే మంత్రి వర్గంలో కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రాధాన్యతలేని శాఖను అప్పగించడం, కమిటీల్లోంచి ఆమెను తొలగించడం ద్వారా తనంతట తానుగా కేంద్ర మంత్రి పదవి నుంచి స్మృతి ఇరానీ తప్పుకునేలా మోడీ స్కెచ్‌ వేశారని సమాచారమ్‌. పరిస్థితులపై కలత చెందుతున్న స్మృతి ఇరానీ త్వరలోనే మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందట.