మంజిమ మాయ ఏ రేంజ్ కెళ్తుందో!

‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న బ్యూటీ మంజిమ మోహన్‌. తొలి సినిమా ఇంకా విడుదల కాకుండానే తెలుగులో మంజిమ మోహన్‌కి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని సమాచారమ్‌. ఓ ప్రముఖ హీరో మంజిమ మోహన్‌ని తన తదుపరి సినిమాలో హీరోయిన్‌గా ఖరారు చేశాడట. సినీ పరిశ్రమలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన హీరో, మంజిమకి ఈ బంపర్‌ ఛాన్స్‌ ఇచ్చాడని తెలియవస్తోంది. ముందుగా ఓ ప్రముఖ హీరోయిన్‌ని తన సినిమా కోసం అనుకున్నా, ఆమె డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతోపాటు ఫ్రెష్‌నెస్‌ కోసం మంజిమకి ఈ ఛాన్స్‌ ఇచ్చాడట ఆ యంగ్‌ హీరో.

తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. కొత్త హీరోయిన్లు ఎందరో వస్తున్నా ఎవరూ నిలదొక్కుకోలేకపోతున్నారు. ఈ టైమ్‌లో మంజిమ మోహన్‌ అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకునేలానే ఉంది. విడుదలైన సినిమాలో మంచి పేరు కొట్టినా కూడా నెక్స్ట్‌ సినిమాకి ఆఫర్స్‌ రాని ఈ టైంలో మంజిమ, విడుదలకు ముందే ఇలా అవకాశాలు చేజిక్కించుకుంటుందంటే ఈ అమ్మడు సామాన్యురాలు కాదనిపిస్తోంది.

చైతూ ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో పాటు విశాల్‌తో కూడా మరో సినిమా సైన్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ. విశాల్‌ కెరీర్‌లో పెద్ద హిట్‌ అయిన ‘పందెం కోడి’ సినిమాకు సీక్వెల్‌ తీయబోతున్నారన్న సంగతి తెలిసిందే. తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలోనూ మంజిమ మోహన్‌ హీరోయిన్‌గా ఎంపికైంది.