తమ్ముడి సినిమాలో అన్నయ్య మెరుపులు!

ఓ హీరో మూవీలో మరో హీరో తుళుక్కున మెరిస్తే.. ప్రేక్షకుడికి ఆనందం రెట్టింపవుతుంది. ఇలా కనిపించే పాత్ర నిడివి తక్కువే అయినా.. అదో తుత్తి తరహాలో సంబరపడిపోతుంటాం. దర్శక-నిర్మాతలు కూడా ఉత్సాహంగా తమ సినిమాల్లో పలువురు హీరో-హీరోయిన్లను గెస్ట్ రోల్స్ లో మెరిపించారు. ఇలాంటి పాత్రలు చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపి.. మరో హీరో మూవీలో సందడి చేశారు. త్వరలోనే ఇలాంటి సీన్ మరో సినిమాలో ఆవిష్కృతం కానుంది. అయితే.. హీరో.. గెస్ట్ గా కనిపించే మరో హీరో కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు. అన్నదమ్ములు. వారెవరో కాదండోయ్… అల్లు వారి వారసులు అర్జున్.. శిరీష్.

అల్లు శిరీష్ హీరోగా మల్లిడి వేణు ఓ చిత్రాన్ని తెరకెక్కించే ఏర్పాట్లలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో శిరీష్ సోదరుడు.. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నట్లు సమాచారం. శిరీష్ కోసమనే కాదు కానీ.. డైరక్టర్ వేణుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అర్జున్ గెస్ట్ రోల్ కు అంగీకరించినట్లు తెలుస్తోంది. వేణు స్టోరీలో వైవిధ్యం, కొత్తదనం అధికంగా ఉందని చెప్పుకుంటున్నారు. అందుకే కథ విన్నంటనే అల్లు అరవింద్ ఓకే చెప్పేశారట.