జిల్లా లొల్లి: కెసియార్‌కి తలనొప్పి 

తెలంగాణలో జిల్లాల లొల్లి తీవ్ర రూపం దాల్చుతోంది. ఎక్కడంటే అక్కడ ఆందోళనలతో ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. జనగామ జిల్లా డిమాండ్‌ వరంగల్‌ జిల్లాలో ఉధృతమవుతుండగా, గద్వాలను జిల్లా చేయాలనే డిమాండ్‌తో మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోరాటం తారాస్థాయికి చేరింది. రహదారి దిగ్బంధనాలు, అధికారుల్ని అడ్డుకోవడం, పోలీసులతో ఆందోళనకారులు తగాదా పడుతుండడం వంటి ఆందోళనలతో తెలంగాణ అట్టుడుకుతోంది. ఇంకో వైపున హైకోర్టు విభజన కోసం పోరాటం కూడా జరుగుతోంది.

ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ ఆందోళన చెందుతున్నారట. జిల్లాల విభజన అంటే పెద్ద తలనొప్పి వ్యవహారం అని కెసియార్‌కి కూడా తెలుసు. 10 జిల్లాల్ని పాతిక జిల్లాలుగా చేస్తున్నా సమస్యలొస్తుండడం ఆశ్చర్యకరమని కెసియార్‌ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే ముందుగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఆ తర్వాత జిల్లాల విభజనపై తగిన చర్యలు తీసుకుంటే బాగుండేది. కానీ కెసియార్‌ అలా చేయడంలేదు. ముందుగా తానే ఓ నిర్ణయం తీసుకుని, దానికి తగ్గట్టుగా అధికారులను సమాయత్తం చేసి, ఆ తర్వాత అఖిలపక్షంతో బలవంతంగా ఒప్పింపజేయాలని చూస్తుండడమే ఇన్ని సమస్యలకు మూలంగా విశ్లేషకులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.