చంద్రబాబూ ఇదేనా ఆయనకిచ్చే గౌరవం?

భారత రాజ్యాంగంలో గవర్నర్,రాష్ట్రపతి పదవులు అనేవి చాలా ప్రత్యేకమైనవి.ఎంతో గౌరవం,హుందా తనంతో నిండిన పదవులు ఆ రెండూను.అయితే రాను రాను గవర్నరును కూడా రాజకీయ లబ్ది కోసం,రాజకీయాలకోసం అన్నట్లు పాలకులు చూస్తున్నారు తప్ప ఆ పదవికి సరైన గౌరవం ఇవ్వడం లేదు.ఇంతవరకు భారత దేశంలో గవర్నర్లు అందరూ ఒకెత్తు నరసింహన్ ఒక్కడే ఒకెత్తు అనేది సామాన్యుడి వాదన.నిజమే ఎందుకంటే గవర్నర్ అంటే ఏదో బంగ్లాలో వుంటూ రాజకీయనాయకులు ఇచ్చిన వినతులు తీసుకుంటూ కాలక్షేపం చెయ్యడమే గవర్నర్ పని అన్నట్టుగా వ్యవహరించేవారు ఇదివరకటి గవర్నర్లు.మరీ ముక్యంగా ND తివారి గవర్నర్ గా వెలగబెట్టిన రాసలీలలు మనందరికీ తెలిసిందే.దాంతో గవర్నర్ మీదున్న గౌరవం పూర్తిగా పోయింది.ఇలాంటి టైం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన నరసింహన్ రాష్ట్ర విభజన ముందు తరువాత ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇది నా పరిధిలోకి రాదు అనుకోకుండా దానికి తానెంతవరకు న్యాయం చేయగలడో అంతకు మించే శ్రమించి పోరాడడం ఆయన నైజం.

తాజాగా గవర్నర్ అమరావతి పర్యటన,ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం పరిశీలిస్తే మన నాయకులు నరసింహన్ కు ఇచ్చే గౌరవం ఇదా అనిపిస్తుంది.మాములుగా అయితే ఏ రాజకీయనాయకుడయినా గవర్నర్ దగ్గరికెళ్ళాలి కానీ ఏ గవర్నర్ కూడా రాజకీయనాయకుల దగ్గరికెళ్ళలేదు ఇప్పటివరకు.కానీ ఎం చేస్తాం ఇది చంద్రబాబు రాజకీయం కదా అందుకే పాపం గవర్నర్ స్వయంగా వెళ్లి బాబుగారిని కలవాల్సొచ్చింది.బాబుగారికి హైద్రాబాద్ వచ్చి గవర్నర్ ని కలిసే తీరిక లేదట పాపం.నరసింహన్ మాత్రం భేషజాలకు పోలేదు తెలుగు ప్రజల ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం.అందుకే తానే వెళ్లి బాబుతో సమావేశమయ్యారు.ఇదంతా ఉమ్మడి రాష్ట్ర హై కోర్టు విభజనకి సంబంధించి చంద్రబాబుని ఒప్పించేందుకు నరసింహన్ పడిన తాపత్రయం.తెలంగాణలో లాయర్లంతా రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు.ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి.ఆ ఎవరో నేనే అని ముందుకొచ్చారు నరసింహన్.

ప్రొటోకాల్ కూడా పక్కకు పెట్టి, ప్రైవేటు హోటల్‌లో బస చేసిన గవర్నర్,రెండు రాష్ట్రాలు సర్దుబాటు ధోరణి ప్రదర్శించాలని గవర్నర్ బాబుకు సూచించారు.కాగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.అయితే ఇక్కడ ఇంకో వాదన కూడా వినిపిస్తోంది.ఆఘ మేఘాలపైన సచివాలయాన్ని తరించిన బాబు హై కోర్టు విషయంలో ససేమిరా అనడం వెనుక వ్యక్తిగత అజెండా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు బాబుకున్న ఒకే ఒక అస్త్రం జగన్ ఆస్తుల పై వున్న కేసులే.ఒకవేళ హై కోర్టు విభజన జరిగితే అవన్నీ తెలంగాణా పరిధిలో ఉండిపోతాయని అప్పుడు తన ప్రభావం ఏ మాత్రం కోర్టులపై జగన్ కేసులపై ఉండదనే భయంతోనే బాబు హై కోర్టు విభజనని ఆలస్యం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.