చంద్రబాబు నెంబర్ వన్ గేమ్ షో

అభివృద్ధి సంగతి దేవుడెరుగు,అంకెల గారడీయే ముఖ్యం అన్న చందాగా తయారయ్యింది చంద్రబాబు వెంపర్లాట చూస్తుంటే.ఏ సమీక్షలు జరిగినా,ఏ రంగంలో చూసినా నంబర్‌-1 స్థానంపైనే మాట్లాడుతున్నారు కానీ వాస్తవిక అభివృద్ధి,క్షేత్ర స్థాయిలో ఆ రంగ వాస్తవ అభివృద్ధి ఏమిటన్నది ప్రభుత్వం ఆలోచించడం లేదన్నది వాస్తవం.

కొద్దిరోజులుగా ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా ఈ నంబర్ గేమ్ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.దీనిపై అధికారులు సైతం విస్తుపోతున్నారు.ఈ అంకెల గారడీ అంతా వాస్తవానికి దూరంగా జరుగుతోంది.ఇక ఈ మధ్య బాగా చర్చనీయాంశం అయినా మరొక అంశం ఈజ్‌ ఆఫ్ డూయింగ్.ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సాధనలో నంబర్‌-1 స్థానంలో ఉన్నట్లు చంద్రబాబు అండ్ భజన మీడియా బ్యాండ్ మోగిస్తోంది. కానీ వాస్తావాలు అందుకు భిన్నంగా వున్నాయి.మచ్చుకు ఒక సందర్భాన్ని మనం పరిశీలిస్తే బాబుకి ఈ నంబర్ పైత్యం ఏ స్థాయికి ఎక్కిందే తెలుస్తుంది.ఈ మధ్య ఒక సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి 3లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్టు,అందులో ఇప్పటికే 70 వేల కోట్లు వచ్చేశాయని ప్రకటించేశారు.దానికి భజన బ్యాచ్ వంత పాడేసింది.అసలా 70 వేలకోట్లు ఎక్కడికొచ్చాయో ఏమి చేశారు అదొక మిస్టరీ.మొత్తంగా ఈ 3 లక్షల కోట్ల పెట్టుబడులులతో రాష్ట్రం దేశంలోనే నంబర్‌-1 అని ప్రకటించేసుకున్నారు.ఇక్కడ కామెడీ ఏంటంటే ఏపి కాకుండా దేశం మొత్తం వచ్చిన పెట్టుబడులు 2.50లక్షల కోట్లని అంచనా.మరి ఒక్క ఏపి కే ఏకంగా 3లక్షల కోట్ల పెట్టుబడులంటే చెప్పే వాళ్ళకెలా ఉన్నా వినే వాళ్ళకే మరీ విడ్డురంగా ఉంది.బాబు చెప్పిన ఈలెక్కలతో అక్కడున్న అధికారులంతా ఇదేం చోద్యం అని ప్రశ్నించుకున్నారు. ఈ గణాంకాలు అశాస్త్త్రీయంగా ఉన్నాయన్నది విశ్లేషకుల భావన.

ఇక ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పైనా ఇదే తంతు.పెట్టుబడులను భారీగా ఆకర్షించేందుకుగాను కేంద్రం సేకరిస్తున్న వివరాలు వాటి డేటా విషయంలో ఆంధ్రా తెలంగాణ మధ్య మళ్ళీ నంబర్‌-1 పోటీ వివాదాస్పదంగా మారింది.తమ డేటా అప్ దొంగిలించిందని బహిరంగంగా తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేయగా,గత ఏడాది నుండి తొలిస్థానం లో ఉన్నా తమకు దొంగిలించాల్సిన పనేంటి ఏపి వాదిస్తోంది. దీనికి తోడు ఈ మధ్య కేంద్రంలో మోడీ ముఖ్యమంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారని, అందులో బాబుకు 13 వ ర్యాంక్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్ కి No 1 ర్యాంక్ ఇచ్చారన్న విషయం బయటికి పొక్కడంతో అన్నింటిలో తామే నంబర్ 1 అని చెప్పుకుంటున్న బాబుకి మోడీ దగ్గర అంత సీన్ లేదని అర్థమైపోయింది.

ఇక వ్యవసాయ నీటిపారుదల రంగంలోనూ తామే బెస్ట్ అని ఊదరగొట్టేస్తున్నారు బాబు గారు.అసలు పోలవరం పూర్తవకుండానే ఇలా వున్నాం ఇక పూర్తయితే మాకెవరూ సరి రారు అనేంతగా మాట్లాడుతున్నారు.మాటలు సరే కానీ పోలవరం పై బాబు చిత్తశుద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది. ఇలా అన్ని రంగాల్లోనూ మేము నంబర్ 1 గా ఉన్నా కేంద్రం మాత్రం తమను విస్మరిస్తోందని బాబు వాపోతున్నారు పాపం.అయితే అధికారులు మాత్రం ఈ అంకెల ప్రహసనంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, క్షేత్ర స్థాయిలో పనులు ఆశాజనకంగా లేవంటున్నారు. పెట్టుబడులకు ఒప్పందాలయిన మాట వాస్తవమే కానీ , వాటిలో కనీసం పదోవంతయినా కార్యరూపం దాల్చడం లేదన్నది కూడా వాస్తవమే.