కేసీఆర్‌ కూడా ‘జై ఆంధ్రా’ అంటారేమో 

తెలంగాణకు జై కొట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి జై కొట్టడం తప్పేమీ లేదు. ఎందుకంటే, అందరం భారతదేశంలో ఉన్నాం. పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్రాలు, అందులో జిల్లాలు, వాటిల్లో మండలాలు, గ్రామాలు తప్ప, దేశమంతా ఒక్కటే. ఓ ప్రాంతంపై విమర్శలు చేయడం, ఇంకో ప్రాంతానికి అనుకూలంగా నినాదాలు చేయడం అంత శుభపరిణామం కాదు . దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు.

అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య సున్నితమైన భావోద్వేగాలున్నాయి. ఉద్యమ వేడిలో సీమాంధ్రులపై కొంత విద్వేషం రగిలినమాట వాస్తవం.ఇప్పుడంతా సద్దుమణిగి రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసుందాం అనే నినాదం ఊపందుకుంది. తాజాగా తెలంగాణా రాజకీయ నాయకులే ఇప్పుడు ‘జై ఆంధ్రా’ అంటున్నారు. రాజకీయ నాయకుల్లో ఈ మార్పు ఆహ్వానించదగ్గదే. తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ కుమార్తె స్వయానా ‘జై ఆంధ్రా’ అనడం అభినందనీయం. తెలంగాణలో ఉన్నవారంతా తెలంగాణ పౌరులేనని చెప్పడం ద్వారా కెసియార్‌ కూడా తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. సమీప భవిష్యత్తులో కెసియార్‌ నోట కూడా ‘జై ఆంధ్రా’ అనే నినాదం రావొచ్చు.

కొంత కాలం క్రితం, అంటే గ్రేటర్‌ ఎన్నికల సమయంలో కెసియార్‌ తనయుడు కెటియార్‌, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి అది కూడా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఈ వరుస పరిణామాలు చూస్తుంటే, ఉప ప్రాంతీయ పార్టీగా ఒకప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా మారి అధికారం దక్కించుకున్నట్లే, సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా పోటీ చేసి, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉనికిని చాటుకుని జాతీయ పార్టీ అనే హోదా సాధించాలని అనుకుంటోందేమో అనిపిస్తోంది. కెసియార్‌గారూ నిజమేనా?