సింగ’పూర్‌’ లో మనకి మిగిలేది పూరే నా?

సింగపూర్‌ చాలా చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని అభివృద్ధి బాట పట్టిన సింగపూర్‌ని చూసి ప్రపంచం గర్వపడుతుంది. ఆ సింగపూర్‌ని చూసి నేర్చుకోవాలంటూ వివిధ దేశాల ప్రముఖులు చెబుతారు. ఆ సింగపూర్‌ని మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సృష్టించాలని కలలుకంటున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడో ముఖ్యమైన అంశం ఉంది. సింగపూర్‌కి, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణ బాద్యతలు అప్పగించడం తప్పు కాదు. కానీ సింగపూర్‌ ప్రభుత్వం వేరు, అక్కడి కంపెనీలు వేరు.

ఏ కంపెనీ అయినా లాభాల గురించే చూసుకుంటుంది. అమరావతి నిర్మాణం చేపట్టే సింగపూర్‌ కంపెనీలు, ఆంధ్రప్రదేశ్‌ని ఉద్ధరించడానికి రావు కదా. అంటే అమరావతి నిర్మాణంతో సింగపూర్‌ కంపెనీలు చేసేది వ్యాపారం మాత్రమే. తద్వారా ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌కి అమరావతిలో 58 శాతాన్ని అమ్మేస్తుందేమో అన్న భావన కలుగుతుంది. వాటాల పంపకాలంటే దానర్థం అదే కదా. కానీ ఆదాయం లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఏదో ఒక సహాయం లేకుండా అంత గొప్ప రాజధానిని నిర్మించుకోవడం అసాధ్యం. అలాగని ప్రైవేటు రాజధానినీ ప్రజలు ఊహించుకోలేరు. సింగపూర్‌ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ‘పూర్‌’గా చంద్రబాబు మార్చేస్తారేమోనని ఆందోళన వ్యక్తమవుతున్నది.మొత్తానికి ప్రపంచానికే పాఠాలు చెప్పిన చంద్రబాబు కే పాఠాలు చెప్పడానికి సింగపూర్ సన్నద్దమౌతోందన్నమాట.