బావ.. బామ్మర్ది..ఓ తెలంగాణా..

ఆ మధ్యన AP CM చంద్రబాబు నాయుడు గారు అసలు తెలంగాణా ప్రజానీకానికి పొద్దున్నే లేవడం NTR గారే నేర్పించారని మాట జారి తరువాత నాలుక కరుచుకోవడం ఆయన వంతైంది.అక్కడికేదో తెలంగాణా వాళ్ళు బద్దకస్తులని వారికి రామారావు గారే పొద్దున్న లేవటం నేర్పారన్నట్టు సెలవివ్వడంతో క్షమాపణ చెప్పే వరకు వెళ్ళింది వ్యవహారం.ఈయనకి ఈ తరహా చలోక్తులు ఈ మధ్యన బాగానే రివర్స్ అవుతున్నాయి.కోడలు మగబిడ్డని కంటా అంటే అత్త వద్దంటుందా అని,వెనుకబడిన కులాల్లో పుట్టాలని ఎవరినా కోరుకుంటారా అని,తప్పు చేయడం వల్లే దేవుడి దగ్గరికి వెళ్తారని,దీక్షల రోజుల్లో మందు తాగాక ఖజానా ఆదాయం తగ్గిపోతోందని,ఇంకా ఇంకా పేకాట రోజు వారి మద్యం సేవించడం పైన తనదైన శైలిలో వివరణ ఇచ్చి ఆ తరువాత షరా మాములుగా నేనలా అనలేదు నా మాటల్ని వక్రీకరించారు అని వక్రభాష్యం చెప్పం ఆయనకీ అలవాటయిపోయింది.

ఇక అసలు విషయానికి వస్తే నందమూరి నటసింహం హిందూపూర్ MLA బాలకృష్ణ గారు USA పర్యటనలో వుండగా తన బావకి తనేం తక్కువ కాదు అన్నట్టు అసలు తెలంగాణా ప్రజలకు తెల్ల బియ్యంతో అన్నం తినడం తన తండ్రి NTR గారి కిలో 2 రూపాయల కె బియ్యాన్ని పెట్టిన తరువాతే తెలిసిందని ఉచిత స్టేట్మెంట్ ఒకటి వదిలేసారు.ఇంకేముంది తెలంగాణా వాదులు బాలకృష్ణ పై భగ్గు మంటున్నారు.అక్కడికేదో తెలంగాణా ప్రజలకు NTR కి ముంది అన్నం తినడం కుడా తెలియదన్నట్టు తెలంగాణా జాతి మొత్తానికి తామే చుక్కాని అన్నంతగా ఈ బావా బామ్మర్ది నోరు పారేసుకుంటున్నారు.