దాసరి కొత్త పార్టీ పెడతారా?

మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారట. కాపు ఉద్యమం నేపథ్యంలో దాసరి నారాయణరావు ఒక్కసారిగా ‘పెద్ద నాయకుడు’ అయిపోయారు. ఈయన చుట్టూనే చిరంజీవి కూడా కనిపిస్తుండడంతో కాపు సామాజిక వర్గం, కొత్త పార్టీ గురించి దాసరి నారాయణరావుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారమ్‌. ఇదివరకు చిరంజీవిపై నమ్మకం పెట్టుకుంది కాపు సామాజిక వర్గం. అది వమ్మయ్యింది. పవన్‌కళ్యాణ్‌ కూడా జనసేనతో కాపు సామాజిక వర్గంలో ఆశలు రేపారు. ఆయనా వారి అంచనాల్ని అందుకోలేకపోయారు.

రెండుసార్లు దగాపడ్డ కాపు సామాజిక వర్గం, ‘మేం పల్లకీ మోయలేం. పల్లకీలో కూర్చుంటాం’ అని గట్టిగా నినదిస్తున్నది. రిజర్వేషన్లే కాకుండా రాజ్యాధికారం దిశగా కాపు సామాజిక వర్గం ఉద్యమబాట పట్టేందుకు అవకాశాలున్నాయని వినికిడి. పరిస్థితిని అంచనా వేస్తూ కొత్త రాజకీయ పార్టీపై సాధ్యా సాధ్యాలను దాసరి నారాయణరావు పరిశీలిస్తున్నారట. సినిమాల్లో బద్ధ వైరం ఉన్నా చిరంజీవితో దాసరి నారాయణరావు ఈ మధ్యన కలుస్తుండడం కూడా కొత్త రాజకీయ పార్టీ కోసమేనని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయ వాతావరణం కాపు సామాజిక వర్గానికి అనుకూలంగా ఉందా? అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. పైగా దాసరి నారాయణరావు కొత్త పార్టీ అంటే ఆయనపైనా నమ్మకాలు తక్కువే.