తెరాస ని డీ కొట్టే సత్తా డీకే అరుణకుందా!!

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నుండి కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిద్యం వహిస్తూ కాంగ్రెస్ లో మహా మహా రాజకీయ కురువ్రుద్దులకే కెసిఆర్ ని ఎలా ఎదుర్కోవాలో తెలీక తెరాస కి దాసోహం అవుతుంటే ఒక్క డీకే అరుణ మాత్రం కెసిఆర్ అండ్ తెరాస పార్టీ పై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అటు అసెంబ్లీ లో ఇటు బయట తెరాస వైఫల్యాల్ని ఎండగడుతూ శభాష్ అనిపించుకుంటోంది.ఇక తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ రాష్ట్ర పర్యటన తదనంతర పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి.

జానారెడ్డినుద్దేశించి టీఆర్ఎస్ కోవర్టు అంటూ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎల్పీనేతగా జానారెడ్డి స్థానంలో డీకే అరుణను నియమించాలని గోవర్ధన్‌రెడ్డి ప్రతిపాదించడం వెనుక నల్గొండ గ్రూపు విభేదాలే కారణమన్న విషయం జగమెరిగిన సత్యమే. అయితే పాల్వాయి వ్యాక్యల్లొ, ప్రతిపాదనల్లో నిజం లేకపోలేదు.అధికార పార్టీ పట్ల జానారెడ్డి మెతక వైఖరి వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్న విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు సీఎల్పీనేతను మార్చాలన్న ప్రతిపాదన సరైందేనంటున్నారు విశ్లేషకులు.

మహబూబ్ నగర్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న డీకే అరుణను తమ వైపు తిప్పుకోవాలని అధికార టిఆరెస్ నాయకత్వం తీవ్ర ప్రయత్నాలే చేసింది. అయినా ఆమె కాంగ్రెస్ ను వీడేది లేదని విస్పష్టం చేశారు. ప్రభుత్వంపై అసెంబ్లీలో, బయట ఎదురుదాడి చేస్తోన్న డీకే అరుణ కుటుంబీకుల ఆధీనంలో ఉన్న బంజారాహిల్స్ భూములను అధికార పార్టీ ఒత్తిళ్లతో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయినా కూడా ప్రభుత్వంపై పోరాటంలో ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన తమ్ముడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఈ మద్యనే తెరాస తీర్థం పుచ్చుకోగా సోంత తమ్ముడిపైనే ఎదురు దాడి చేసింది డీకే అరుణ. అవసరమైతే బిచ్చమైనా ఎత్తుకుంటాను కాని తెరాసలో మాత్రం చేరను అని కుండ బద్దలు కొట్టినట్టు తెగేసి చెప్పేసింది.

ప్రస్తుతం కెసిఆర్ దూకుడుకి డీకే అరుణ లాంటి డైనమిక్ లేడీ అయితేనే సరైన సమాదానం ఇవ్వగలదు. ఇక్కడ కాంగ్రెస్ కి కావాల్సింది అనుభవం ఆచి తూచి స్పందించే నాయకత్వం కాదు. దెబ్బకి దెబ్బ మాటకి మాట సమాధానం చెప్పగలిగే నాయకత్వం. అది డీకే అరుణకి వారసత్వంగా వచ్చిన గుణం. ఆమె అయితేనే కాంగ్రెస్స్ పార్టీకి మళ్లీ కొత్త ఉత్సాహం వస్తుందని,కెసిఆర్ దూకుడికి కళ్ళెం వేస్తుందనీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.