డబ్బులివ్వలేం రాష్ట్రానికి తేల్చి చెప్పిన కేంద్రం

రెవెన్యూ లోటును భర్తీ చేయలేమంటే కుదరదని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిందేనని కేంద్రానికి స్పష్టం చేసింది. ఒక్క రైతు రుణమాఫీ తప్ప ఏ ఒక్క పథకాన్ని తాము కొత్తగా తీసుకురాలేదని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.16,078.76 కోట్ల రెవెన్యూ లోటు తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సాయంగా విడుదల చేసిన రూ.2,303 కోట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 నాటికి రూ.13,775.76 కోట్ల లోటు ఉన్నట్టు కాగ్ తేల్చింది. కేంద్ర ప్రభుత్వం 2015-16లో రూ.500 కోట్లు విడుదల చేయడంతో నికర రెవెన్యూలోటు రూ.13,275.76 కోట్లుగా తేలింది.

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న రెవెన్యూలోటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. విభజన చట్టం ప్రకారం ఆవిర్భావ సంవత్సరమైన 2014-15లో ఏర్పడిన లోటును కేంద్రం భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టినందున వాటికి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిజానికి అవి ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చినవేనని చెబుతోంది. కొత్త పథకాలను అమలు చేస్తున్నారన్న పేరుతో విభజన జరిగిన తొలి ఏడాది ఏర్పడిన ఇప్పుడు చెల్లించిన విద్యుత్తు బకాయిలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు పాత ప్రభుత్వాలు పెండింగ్‌లో పెట్టినవేనని గుర్తు చేసింది. డబ్బులేకనే 10వ వేతన సంఘం సిఫార్సులనూ సంవత్సరం ఆలస్యంగా అమలు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఉద్యోగులకు పాత బకాయిల కింద రూ.3800 కోట్లు చెల్లించాల్సి వచ్చి ఉండేదని, రెవెన్యూ లోటు మరింత పెరిగి ఉండేదని వివరించింది. అందువల్ల ఏపీ ప్రభుత్వానికి తొలి ఏడాది ఏర్పడిన రెవెన్యూ లోటు కింద తక్షణం రూ.13,275 కోట్లు విడుదల చేయాలని కోరింది.

కేంద్ర ప్రభుత్వం 2015-16లో రూ.500 కోట్లు విడుదల చేయడంతో నికర రెవెన్యూలోటు రూ.13,275.76 కోట్లుగా తేలింది. రెవెన్యూ లోటుకు సంబంధించి కాగ్ జారీచేసిన ధ్రువీకరణ పత్రంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో అమలు చేసిన కొత్త పథకాలంటూ జాబితా ఇచ్చింది. 2013-14లో ఆ పేరుతో ఎలాంటి ఖర్చు చేయనందున అవి కొత్త పథకాలని చెబుతోంది. నిజానికి అవి కొత్త పథకాలు కావు. 2013-14లో అమలు చేసిన అమ్మహస్తం 2014-15లో అన్నహస్తంగా, రాజీవ్ ఆరోగ్యశ్రీ డాక్టర్ ఎన్‌టీఆర్ వెద్యసేవగా మారాయి. కొన్ని పథకాల పద్దుల్లో మార్పులు జరిగాయి. కొన్నింటిని ప్రణాళిక నుంచి ప్రణాళికేతరానికి, మరికొన్నింటిని రెవెన్యూ నుంచి మూలధన పద్దులకు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి అండ్ టెక్నాలజీ పద్దులను యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ పద్దుల కింద మార్చారు.

రైతుల సాధికారతకు నిధులు : 2014-15 ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఎలాంటి కొత్త రాయితీలు ప్రకటించలేదు. పాతవి కొనసాగాయి. రైతుల ఆత్మహత్యలు, వారి ఇబ్బందులను గుర్తించి వారి సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థకు రూ.7,069.67 కోట్ల గ్రాంట్ అందజేసింది. అందులో రూ.3,069.67 కోట్లను రైతుల రుణవిముక్తి కోసం ఉపయోగించింది. మిగిలిన రూ.4వేల కోట్లు సూక్ష్మసేద్యం, భూ అభివృద్ధి, వ్యవసాయ యాంత్రీకరణ, ఆగ్రోప్రాసెసింగ్, మార్కెటింగ్ ప్రోత్సాహం వంటి వాటికి ఉపయోగించారు.

విద్యుత్తు రంగానికి ఆర్థిక పునర్నిర్మాణ ప్యాకేజీ : 2014-15లో విద్యుత్తు సంస్థలకు కానీ, వినియోగదారులకుకానీ ఎలాంటి కొత్త రాయితీలు ఇవ్వలేదు. అయితే, విద్యుత్తు సంస్థలకు ఆర్థిక పునర్నిర్మాణ ప్యాకేజీ అమలు చేయాలని 2012లో కేంద్ర విద్యుత్తు శాఖ జారీచేసిన నోటికేషన్‌కు అనుగుణంగా డిస్కంలకున్న రూ.4,046.15 కోట్ల రుణాన్ని దశలవారీగా తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 2014-15లో డిస్కంలకు సంబంధించిన రూ.1,500 కోట్ల అప్పులను స్వీకరించారు. వాటికి వడ్డీల చెల్లింపుల కోసం రూ.201.93 కోట్లు విడుదల చేశారు. 2012-13 నుంచి వారసత్వంగా వచ్చిపడిన భారాన్ని 2014-15లో తీర్చారు.

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు : ఉమ్మడి రాష్ట్రంలో 2010-15 పారిశ్రామిక విధానం ప్రకారం పరిశ్రమలకు కొన్ని నిర్దిష్టమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. అందులో భాగంగా 2014-15లో వాటికి విద్యుత్తు సబ్సిడీల కింద రూ.1,175.57 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. 2011-14 మధ్య కాలంలో గత ప్రభుత్వాలు ప్రోత్సాహకాలకు పెద్దగా ఏమీ చెల్లించలేదు. 2010-15 పారిశ్రామిక విధానం అమలుకు 2014-15 ఆర్థిక సంవత్సరమే చిట్టచివరి సంవత్సరం కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో చెల్లించాల్సిన ప్రోత్సాహకాలను చెల్లించని పరిస్థితి ఎదురైంది.