టీడీపిలో అంతర్గతపోరు!

ఆపరేషన్ ఆకర్ష్‌తో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అలజడికి గురిచేసిన అధికార టిడిపిలోనూ ఈ వలసల వల్ల అంతర్గత పోరు తీవ్రమవుతోందన్న వాదనలు ఆ పార్టీలోనే వినవిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ఏకైక లక్ష్యంగా సాగిన ఈ వలసలు తమ పార్టీకి కూడా మున్ముందు పెద్ద సవాల్‌గా మారే ప్రమాదాలు కనిపిస్తున్నాయని టిడిపి నేతలు కొందరు వ్యాఖ్యనిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసవచ్చిన ఎమ్మెల్యేలకు టిడిపిలో ఒకప్పుడు తనకు ప్రత్యర్థిగా ఉన్న నేతలతో తీవ్ర వైరమున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇరు ప్రత్యర్థులు ఒకే వేదికను పంచుకోవడంతో ప్రస్తుతం టిడిపిలో అంతర్గత పోరు, ఆధిపత్యపోరుకు బీజం పడుతోందని తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు వాపోతున్నారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతున్న ఎమ్మెల్యేల వలసలతో టిడిపి ఎంతగా బలపడినా పార్టీలో పెరిగే ఆధిపత్యపోరుపై పార్టీ అధినాయకత్వం దృష్టిసారించకపోతే మున్ముందు అవే ప్రమాదఘటికలుగా మారే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు వైసిపి నుంచి తమ పార్టీలోకి కొనసాగిన ఎమ్మెల్యేల వలసల వల్ల ప్రతి జిల్లాలలో ఒకటి, రెండు చోట్ల మినహా పాత, కొత్త వారి మధ్య ఆధిపత్యపోరుకు బీజం వేస్తోందని టిడిపి ముఖ్యనేతలు సైతం అంతర్గతంగా అంగీకరిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వలస వచ్చారు. ఇంత పెద్ద ఎత్తున్న ఎమ్మెల్యేలు అధికార పక్షంలోకి వలసలు వెళ్లడం ప్రధానప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర వాతావరణమైతే ఈ వలసవచ్చిన నేతలతో అధికార పక్షానికి పెద్ద సవాల్ కూడా అని చెప్పవచ్చు. ఇలా వలస వచ్చిన ఎమ్మెల్యేల వల్ల టిడిపిలో ఒకటి, రెండు చోట్ల మినహా ప్రతిచోట ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ వలస వచ్చిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే టిడిపిలో ఉండి గత సార్వత్రిక ఎన్నికల్లో వారికి ప్రత్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన వారు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా కొన్ని జిల్లాలలో వైసిపి నుంచి వచ్చిన నేతలకు టిడిపిలో ఉన్న నేతలకు పాతగొడవలు కూడా ఈ ఆధిపత్య పోరుకు అధికార పార్టీలో ఈ ఆధిపత్య పోరుకు బీజం వేస్తున్నాయి. ఇలా జిల్లాల వారీగా చూస్తే ఈ పరిస్థితి మనకు అవగతమవుతుంది. కర్నూలు జిల్లాలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు. అప్పటికే ఆ ప్రాంతం నుంచి టిడిపిలో చేరిన శిల్పా మోహన్‌రెడ్డికి ఆయనకు మధ్య ప్రతి విషయంలో ప్రచ్ఛన్న యుద్దం సాగుతోంది. తమ అనుచారుడి హత్య వెనక భూమా నాగిరెడ్డి హస్తముందని శిల్పా మోహన్‌రెడ్డి ఏకంగా చంద్రబాబు వద్దకు పంచాయతీ తీసుకెళ్లారు.

ఇక కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి టిడిపిలో చేరికతో అప్పటికే టిడిపిలో కొనసాగుతున్న టి.జి.వెంకటేష్ గుర్రుగా ఉన్నారు. అయితే టి.జి.వెంకటేష్‌కు ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా చంద్రబాబు ఎంపిక చేశారు. దీంతో టి.జి.వెంకటేష్ కొంతశాంతించారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ కర్నూలు నగరంలో ఆధిపత్యపోరుకై టి.జి. వెంకటేష్, ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య సయోధ్య కుదురుతుందా అన్న దానిపై ఇంకా సందేహాలు లేకపోలేదని కర్నూలుజిల్లా టిడిపి నేతలు వ్యాఖ్యనిస్తున్నారు. ఇక అనంతపురంజిల్లాలో జె.సి. బ్రదర్స్ రాకతో అటు పరిటాల సునీత, ఇటు ఎమ్మెల్యే ప్రభాకర్ ఛౌదరికి గిట్టడంలేదు. వారి మధ్య గ్రూపు పోరు, ఆధిపత్య పోరు టిడిపిలో కొనసాగుతోంది. ఇటీవల జె.సి.బ్రదర్స్‌కు ఎమ్మెల్యే ప్రభాకర్ ఛౌదరికి మధ్య విభేదాలు తీవ్రమైన విషయం తెలిసిందే. ఇక కడపజిల్లాలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాకతో ఎప్పటినుంచో టిడిపిలో కొనసాగుతున్న రామసుబ్బారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. వీరి రెండు కుటుంబాల మధ్య తొలినుంచి ఫ్యాక్షన్ తగాదాలున్నాయి. దీంతో ఈ విభేదాలు ఇరువురు నేతలు ఒకే పార్టీలో కొనసాగడంతో ఇంకా తీవ్రమయ్యాయని టిడిపి వర్గాలే వ్యాఖ్యనిస్తున్నాయి. ఇలా ప్రతిజిల్లాలో టిడిపిలో ఇప్పటికే కొనసాగుతున్న నేతలకు వైసిపి నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

పట్టుకోసం పాట్లు?
ఈ వలసల వల్ల పాత, కొత్త నేతల మధ్య పార్టీలో పట్టుకోసమే ప్రధానంగా ఆధిపత్య పోరు కొనసాగుతుందని తెలుస్తోంది. వలసవచ్చిన ఎమ్మెల్యేల వల్ల తమ స్థానం పార్టీలో ఎక్కడ గల్లంతవుతుందోనన్న ఆందోళన టిడిపిలో ఇప్పటికే కొనసాగుతున్న నేతల్లో కలుగుతున్నట్లు తెలుస్తోంది. వలసవచ్చిన నేతలకే భవిష్యత్తులో అందలం ఎక్కించి తమను పక్కనెడుతారా అన్న ఆందోళన కూడా పాత నేతల్లో కొనసాగుతోందని టిడిపికి చెందిన ఓ సీనియర్ నేత పేర్కొంటున్నారు. మరోవైపు వలస వచ్చిన ఎమ్మెల్యే టిడిపిలో తనకంటు ఓ ముద్రవేసుకోవాలని చేసే ప్రయత్నంలో పార్టీలో ఆధిపత్యపోరుకు బీజం పడుతోందని మరి కొందరు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. టిడిపిలోకి ఆహ్వానించడం ద్వారానే తమకు ప్రత్యేకత ఉందని, ఈ నేపథ్యంలో పార్టీలో పట్టుపెంచుకొంటే మరింత లాభమన్న కోణంలో వలసవచ్చిన ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని టిడిపికి చెందిన ముఖ్యనేత ఒకరు చెబుతున్నారు. ఈ పరిణామాలే టిడిపిలో అంతర్గత ఆధిపత్యపోరుకు బాటలు వేస్తున్నాయని వారు చెబుతున్నారు. ఈ పరిణామాలపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిసారించాలని, లేకపోతే ఈ వలసల వల్ల ప్రస్తుతం కొంత ప్రయోజనం కలిగినా భవిష్యత్తులో అవే శాపాలుగా మారే ప్రమాదముందని టిడిపి నేత ఒకరు పేర్కొంటున్నారు.