కాంట్రవర్సీలకు కేరాఫ్ గా సిద్ధారామయ్య

కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారారు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య. ఖరీదైన వాచ్ వ్యవహారం.. కాకి వాలిందని కారు మార్చడం.. పబ్లిక్ లో కార్యకర్త ముద్దు పెట్టడం ఇలా రోజూ ఏదో ఇష్యూలో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఆయన జీవిత చరిత్రపై రాసిన పుస్తకాన్ని స్కూళ్ల లైబ్రరీలో తప్పనిసరి అంటూ సర్క్యులర్ ఇవ్వడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ప్రభుత్వ స్కూళ్ల లైబ్రరీల్లో ఈ పుస్తకం తాలూకు కనీసం రెండు కాపీలు పిల్లలకు అందుబాటులో ఉంచాలని జీవోలో పేర్కొంది కర్ణాటక ప్రభుత్వం. కన్నడ భాషలో ఉన్న ఈ పుస్తకంలో.. సిద్ధ రామయ్య ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్ ప్రభుత్వంతో పోల్చుతూ ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని కేటాయించారు. పేరెంట్స్ మాత్రం పిల్లల పాఠ్యాంశాల్లోకి రాజకీయాలను చేర్చడమేంటని మండిపడుతున్నారు. ఇదే విషయంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల పరిజ్ఞానాన్ని పెంచడానికి ఈ పుస్తకాలు ఏ రకంగా ఉపయోగపడతాయని ప్రశ్నిస్తోంది. పుస్తకం తప్పనిసరి చేస్తూ అన్ని పాఠశాలలకు పంపిన సర్క్యులర్స్ ను వెనక్కి తీసుకోవాలని, పుస్తకాల పంపిణీని నిలిపివేయాలని డిమాండ్ చేసింది. పుస్తకం ధర 300 రూపాయలు కాగా… ఈ పుస్తకం కేవలం రిఫరెన్స్ మెటీరియల్ లో భాగమే అంటోంది విద్యాశాఖ.