నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. గత 23 రోజుల నుంచి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బ్రెయిన్ డెడ్ కారణంగా తారకరత్న కన్నుమూసినట్టు తెలుస్తుంది.
తారకరత్న అకాల మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే మరణించడం పట్ల సంతాపం ప్రకటించారు. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. అయితే ఆఖరి కోరిక నెరవేరక ముందే తారకరత్న అస్తమయం అవ్వడం అభిమానులను మరింత వేదనకు గురి చేస్తోంది. ఇంతకీ తారకరత్న ఆఖరి కోరిక ఏంటంటే.. తనకి ఎంతో ఇష్టమైన బాబాయ్ బాలకృష్ణ తో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని అనుకున్నాడట.
తారకరత్నపై ఉన్న ప్రేమతో అతడి కోరిక తీర్చాలని బాలయ్య భావించాడట. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నాడు. అందులో తారకరత్న కోసం ఒక ముఖ్యమైన పాత్రను డిజైన్ చేయించాడట. కానీ, బాబాయ్ తో నటించే అవకాశం దక్కకుండా తారకరత్న వెళ్లిపోయాడు. కాగా, తారకరత్న ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతుంటే తన పనులు మానకుని అన్నీ తానై చూసుకుంటూ ఆస్పత్రికే అంకితమయ్యారు బాలయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి తర్వాత తండ్రిగా తారకరత్న బాధ్యతలన్నీ భుజానికెత్తుకున్నాడు. తారకరత్నను కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నించారు. కానీ ఊహించనిది జరగడమే జీవితం. ఏదేమైనా తారకరత్న భౌతికంగా దూరమైనా కుటుంబీకులు, అభిమానుల్లో గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటారు.



