భారీ ధరకు ఎన్టీఆర్ ‘ దేవర ‘ ఆడియో రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ ..

యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్నా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 5న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వస్తున్న సినిమా కావడం, అది కూడా ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా తరువాత రెండేళ్ల గ్యాప్ తో ఈ సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ లుక్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, జాన్వి కపూర్ ఫస్ట్ లుక్‌ కూడా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయ‌నున్నారు.

తాజాగా ఈ సినిమా యూనిట్ ఓ ఇంట్ర‌స్టింగ్ అప్డేట్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. దేవర సినిమా ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు వివరించింది. అయితే ఎంతధ‌ర‌కు అమ్ముడైన విషయం మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ సినిమాకు తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అయినా అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.