శిరస్సు లేని అమ్మవారి ఆలయం ఉందని తెలుసా.. ఎక్కడంటే..?

శిరస్సులేని అమ్మవారా.. ఆలయం కూడా ఉందా.. ఇంతకీ అది ఎక్కడ ఉంది అని ఆశ్చర్యపోతున్నారా. ఈ ఆలయం విశాఖపట్నం జిల్లా, అక్కయ్యపాలెం సమీపంలోని దొండపర్తి గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి తల ఉండదు. ఆ స్థానంలో ఓంకారం మాత్రమే కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి పాదాల దగ్గర శిరస్సు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ అమ్మవారికి కేవలం బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటే చాలు భక్తులు అడిగిన కోరికలను తీరుస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అమ్మవారు మూడో శతాబ్దంలో ఇక్కడ వెలసినట్లు తెలుస్తోంది.

కేవలం విశాఖ వాసులకే కాకుండా ఉత్తరాంధ్రలో సత్యం చెప్పే అమ్మ‌గా ఈ ఎరుకుమాంబ త‌ల్లిని చాలామంది కొలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారు కొలువున్న వెనుక భాగంలో శ్రీ చక్రం ఉందని భక్తులు చెబుతున్నారు. ఈమె గౌరీ స్వరూపిగా జనం భావిస్తారు. ఒకప్పుడు రైల్వే స్టేషన్ పక్కన ఉన్న వైర్లెస్ కాలనీలో ఈ అమ్మవారి పూజలు అందుకునే వారిని.. ఇక్కడ ప్రజలు వివరిస్తున్నారు. గౌరీ స్వరూపమైన ఈ అమ్మవారిని ఎద్దుల బండిమీద తీసుకువచ్చారట.

అది ఆగిన చోటే అమ్మవారికి ఆలయం నిర్మించాలని అప్పటి పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో అమ్మవారిని ఎడ్ల బండి పై తీసుకు వెళుతుండగా అమ్మవారి తల వేరుపడిందని.. ఎంత ప్రయత్నించినా.. దాన్ని అతికించే ప్రయత్నం అన్నీ చేసిన అసలు సాధ్యం కాలేదని తెలుస్తుంది. అప్పుడు భక్తులు అమ్మవారిని వేడుకోగా.. తన కాళ్ల దగ్గర శిరస్సు పెట్టి.. కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు నా దీవెనలు మీకు ఉంటాయంటూ అమ్మవారు భక్తులను అనుగ్రహించారట‌.