అయోధ్య: సైబర్ నేరగాళ్ల కొత్త స్కెచ్.. రామ మందిరంలో విఐపి దర్శనం అంటూ..

ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. రామ మందిరంలో దర్శనం కోసం వీఐపీ దర్శనం పేరుతో కొత్త వ్యూహం పన్నారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ లో తెలియని నెంబర్ల నుండి కొంతమంది వ్యక్తులు ఈ మెసేజ్లు పంపుతున్నారు. లక్షలాదిమందికి వస్తున్న ఈ మెసేజ్ ఒక స్కామ్ అని సైబర్ అధికారులు నిర్ధారించారు. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు సన్నాహాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో కోట్లాదిమంది రామ భక్తులు ఆ రాముల వారి దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మోసగాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో మునిగిపోయారు. రామ్‌ లల్లాను విఐపి దర్శనం చేసుకోండి అంటూ ప్రజలకు కొన్ని నెంబర్ల నుండి వాట్సాప్ లో మెసేజ్‌లు జారీ చేస్తున్నారు. అయితే ఏ విధంగా సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారో ఒకసారి చూద్దాం.మొదట సందేశంలో రామ్ జన్మభూమి గృహ సంపర్క అభియాన్ అనే APK ఫైల్ వస్తుంది. ఇది మెసేజ్ కాదు ఫైల్. పొరపాటున ఈ ఫైల్ పై క్లిక్ చేస్తే మనం మోసపోయినట్లే. రెండో మెసేజ్ లో విఐపి యాక్సెస్ పొందడానికి రామ్ జన్మభూమి గృహ సంపర్క అభియాన్ని ఇన్స్టాల్ చేయండి అంటూ మెసేజ్ వస్తుంది.

ఇది కాకుండా మూడవ సందేశం అభినందనలు మీరు అదృష్టవంతులు జనవరి 22 రామాలయంలో దర్శనానికి మీకు విఐపి ప్రవేశం లభించింది అంటూ మెసేజ్‌ వస్తుంది. ఇలాంటి మోసపూరిత సందేశాలు పంపుతూ సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. పొరపాటున ఈ ఫైల్ పై క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ చేసి మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇలాంటి ఫైలు కానీ, మెసేజ్ కానీ ఏదైనా మీ ఫోన్కు వస్తే ముందుగా దానిపైన క్లిక్ చేయడం గానీ ఫార్వర్డ్ చేయడం గానీ దయచేసి చేయవద్దు.. మూడవ పని అయోధ్యలో రామ మందిరం పేరుతో అలాంటి సందేశం వస్తే వెంటనే రిపోర్ట్ చేసి.. బ్లాక్ చేయండి. ఈ రిపోర్ట్ చేయడానికి చాట్ బాక్స్ లో కుడివైపు పైన ఉన్న మూడు చుక్కల మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు రిపోర్ట్ ఆప్షన్ ఎంపిక చేసుకొని రిపోర్ట్ చేయాలి ల‌ని అధికారులు చెబుతున్నారు.