తెలంగాణ ఎన్నికలు మంచి రసవత్తరంగా మారాయి. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో నినాదం హైలెట్ అవుతుంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో లోకల్.. నాన్ లోకల్ – అహంకారం, ఆత్మగౌరవం నినాదాలు మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో లోకల్, ఆత్మగౌరవం నినాదాలు విజయం సాధించాయి. అయితే ఇప్పుడు మరోసారి అవే నినాదాల మధ్య పోటీ జరుగుతుంది. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఖందాళ ఉపేందర్ రెడ్డి లోకల్, ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు.
ఆ ఎన్నికల్లో ఆయన తాను పాలేరుకు లోకల్ అని.. నాన్ లోకల్ అయినా వ్యక్తులకు తనకు మధ్య జరిగే పోరాటం ఈ ఎన్నికలు అని.. అలాగే సత్తుపల్లి అహంకారానికి… పాలేరు ఆత్మ గౌరవానికి పోటీయే ఈ ఎన్నికలు అంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ నినాదం ఆ ఎన్నికల్లో గ్రామాల్లోకి ఓటర్లలోకి బాగా చొచ్చుకుపోయింది.. అందుకే కాకలు తీరిన రాజకీయ యోధుడు అయిన తుమ్మల నాగేశ్వరరావు పై ఉపేందర్ రెడ్డి సంచలన విజయం సాధించారు. కాలక్రమంలో ఐదేళ్లు గడిచిపోయాయి.
ఇప్పుడు 2023లో మళ్ళీ తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి. మళ్లీ కందాల ఉపేందర్ రెడ్డికి అదే నినాదం ప్రధాన ఎన్నికల ఆయుధంగా మారింది. ఐదేళ్లలో ఉపేందర్ రెడ్డి అధికార పార్టీలో చేసిన అభివృద్ధితో పాటు పాత నినాదాలు కూడా ఆయనకు విజయాస్త్రాలుగా మారాయి. 2018 ఎన్నికల్లో తనకు ఎదురైన రాజకీయ అనుభవమే ఈసారి ఎదురుకానుంది. మళ్లీ లోకల్ నాన్ లోకల్ – సేమ్ టు సేమ్ సత్తుపల్లి అహంకారం.. పాలేరు ఆత్మగౌరవం నినాదాలు మధ్య పాలేరులో ఈ సారి కూడా ఎన్నికలు జరుగుతున్నాయన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి.
గత ఎన్నికల్లో ఉపేందర్‌రెడ్డిపై పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నుంచి సుధీర్ఘకాలంగా రాజకీయాలు చేశారు. అక్కడ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. అయితే పాలేరులో ఆయన ఉప ఎన్నికల్లో గెలిచినా మనస్ఫూర్తిగా పాలేరు ప్రజల హృదయాలను గెలవలేదు. అందుకే ఆయన సాధారణ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు ఉపేందర్ రెడ్డిపై పోటీ చేస్తోన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా అదే సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన వారు.
దీనికి తోడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లు అదే పార్టీలో ఉన్న పొంగులేటి ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవ్వరిని గెలవనీయను అంటూ మాట్లాడుతుండడం చాలామందికి నచ్చడం లేదు. అందుకే మరోసారి కందాళకు పాత నినాదమే ఇప్పుడు ఆయనకు కొత్త ఎన్నికల అస్త్రంగా మారుతోందన్న చర్చలు జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.