ఐటీ దాడులంటూ.. పొంగులేటి `పొలిటిక‌ల్ డ్రామాలు`

ఖ‌మ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కొత్త నాట‌కాల‌కు, రాజ‌కీయ డ్రామాల‌కు తెర‌దీశార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న ఇళ్లు, కార్యాల‌యాల‌పై గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న ఐటీ దాడుల‌ను ఆయ‌న రాజ‌కీయంగా వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ప్ర‌జ‌ల్లో సింప‌తీని గెయిన్ చేసుకుని ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఆయ‌న తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని..ఈ క్ర‌మంలోనే ఐటీ దాడుల‌ను కూడా వినియోగించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

నిజానికి ఒక్క తెలంగాణ‌లోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎలాంటి అక్ర‌మాలు జ‌ర‌గ‌కుండా.. ఎన్నిక‌ల సంఘం ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక‌, అనుమానం ఉన్న వారిపై ఐటీ స‌హా ఈడీల‌కు ఉప్పందిస్తున్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఐటీ, ఈడీ దాడులు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్నాయి. ఇక‌, ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఐటీ దాడులు కూడా ఈ కోవ‌లేవే త‌ప్పే.. దీని వెనుక రాష్ట్ర స‌ర్కారు కానీ.. ప్ర‌త్య‌ర్థులుకానీ.. ఉండే అవ‌కాశం కానీ.. ఉంటార‌ని ఊహించ‌డం కానీ చేయ‌లేం.

 

ఎందుకంటే.. ఐటీ, ఈడీ వంటి సంస్థ‌లు.. కేంద్రం ప‌రిధిలో రాజ్యాంగం ప్ర‌కారం ఏర్ప‌డిన‌వి. ఇవి రాష్ట్ర‌ప్ర‌భుత్వాల క‌నుస‌న్న‌ల్లోనో.. లేక‌.. ప్ర‌త్య‌ర్థులు చెప్పిన‌ట్టో న‌డుచుకునే అవ‌కాశం లేదు. పైగా ప‌టిష్ట‌మైన ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌, ఎన్నిక‌ల సంఘం ఉన్న భార‌త్‌లో అక్ర‌మాల‌కు చోటి వ్వ‌రాద‌న్న సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ఆయా సంస్థ‌లు న‌డుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అనుమానం ఉన్న వారిపై నిరంత‌ర దాడులు చేస్తున్నాయి. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌, ఎన్నిక‌ల‌ను స‌జావుగా సాగించాల‌నే ఉద్దేశం త‌ప్ప‌.. దీనిలో ఎక్క‌డా క‌క్ష పూరిత రాజ‌కీయాలు ఏమాత్రం లేవు.

అంతా ఆయ‌న చేసుకున్న‌దే..!
వాస్త‌వానికి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌. ఈ క్ర‌మంలో ఆయ‌న 70కిపైగా కంపెనీలు స్థాపించారు(వాస్త‌వానికి ఇవి డ‌బ్బా కంపెనీల‌నే ప్ర‌చారం ఉంది) అయితే.. వీటి అడ్ర‌స్ మాత్రం ఒక‌టే కావ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో ఆయా కంపెనీల‌కు డైరెక్ట‌ర్లుగా, చైర్మ‌న్లుగా కుమారుడు, అల్లుడు, కుమార్తెల‌నే ఆయ‌న పేర్కొన్నారు. స‌హ‌జంగా ఇన్ని వ్యాపారాలు నిజంగానే చేయాల‌ని అనుకున్న‌ప్పుడు.. ఎలాంటి అక్ర‌మాల‌కు తావులేన‌ప్పుడు నిజాయితీ ఉంటుంది. కానీ, ఒకే అడ్ర‌స్‌తో ఇన్ని కంపెనీలు స్థాపించ‌డం అంటే.. ఖ‌చ్చితంగా అనుమానాలు వ‌స్తాయి. ఇప్పుడు ఇదే.. ఐటీ దాడుల‌కు కార‌ణ‌మైందనే వాద‌న ఉంది. ఇది పొంగులేటి స్వ‌యంగా చేసుకున్న‌దే త‌ప్పా ఆయ‌న ఎవ్వ‌రి మీద నెపం నెట్ట‌డానికి వీల్లేదు.

పొంగులేటి దేశ‌వ్యాప్తంగా స్థాపించాన‌ని చెబుతున్న ఆయా కంపెనీలు వాస్త‌విక‌త‌కు ద‌గ్గ‌ర‌గా..ప‌న్నులు చెల్లిస్తున్నాయా ? లేదా ? అనే సందేహం ఐటీ కంపెనీల‌కు స‌హ‌జంగానే వ‌స్తుంది. దీనికితోడు.. ఎన్నిక‌ల వేళ ఆర్థిక లావేదేవీలు పెరిగే అవ‌కాశం కూడా ఉంద‌నే సందేహాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఐటీ దాడులు చేసి ఉంటుందే త‌ప్ప‌.. దీని వెనుక సీఎం కేసీఆర్‌కానీ, ప్ర‌త్య‌ర్థికానీ ఉండే అవ‌కాశం లేదని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇంకో కోణం కూడా..!
ఇక‌, పొంగులేటి ఇళ్లు, కార్యాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల వెనుక మ‌రో కోణం ఉండి ఉండొచ్చ‌ని కూడా ప‌రిశీల‌కులు, ప్ర‌త్య‌ర్తులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎంపీగా ఉన్న స‌మ‌యంలో ఢిల్లీలోని ఐటీ విభాగం అధికారుల‌తో ఆయ‌న స్నేహాలు సాగించార‌ని.. వారితో సత్సంబంధాలు ఉన్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు ముందు ఉద్దేశ పూర్వ‌కంగా.. ఈ దాడులు త‌నే స్వ‌యంగా చేయించుకుంటున్నారేమోన‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అటు ఎంపీగా ఉన్న‌ప్పుడు బీజేపీతో కూడా స‌త్సంబంధాలు మెయింటైన్ చేసి ఆ లాబీయింగ్‌తో కూడా కావాల‌నే త‌న‌పై ఐటీ దాడులు చేయించుకునేలా కూడా తెర‌వెన‌క ప్లాన్ చేసుకున్న‌ట్టు టాక్ ? త‌ద్వారా.. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొంది.. విజ‌యం ద‌క్కించుకోవాల‌నే మాస్ట‌ర్ ప్లాన్ వేసి ఉంటార‌ని అంటున్నారు. ఏదేమైనా.. పొంగులేటి ఐటీ దాడి అంటూ డ్రామా ఎంత ర‌క్తిక‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నా నియోజ‌క‌వ‌ర్గంలోనూ, జిల్లాలోనూ ఆయ‌నది డ్రామా గేమ్ అన్న చ‌ర్చే స‌గ‌టు ప్ర‌జ‌ల్లోనూ చ‌ర్చ‌కు వ‌స్తోంది.