పార్టీ వేవ్ ఉన్నా గెల‌వ‌ని స‌త్తా ‘ తుమ్మ‌ల‌ ‘ కే సొంతం…!

తుమ్మల నాగేశ్వరరావు కాకలు తీరిన రాజకీయ యోధుడు.. ఖమ్మం జిల్లాలో నాలుగు దశాబ్దాల పాటు శాసిస్తున్న రాజకీయ నేత అని గొప్పలు చెబుతూ ఉంటారు. 2014 ఎన్నికలలో ఖమ్మంలో రాజకీయంగా ఓనమాలు దిద్దని పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోతే సీఎం కేసీఆర్ తన పాత మిత్రుడు అని పిలిచి మంత్రిని చేసి క్యాబినెట్లో తన ప‌క్క‌న‌ కూర్చో పెట్టుకున్నారు. అలాగే ఎమ్మెల్సీని చేశారు. అనూహ్యంగా పాలేరులో దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి అకాల మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో తుమ్మల బీఆర్ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 45 వేల పైచిలుకు భారీ మెజార్టీతో విజయం సాధించారు. వాస్తవంగా ఆ ఎన్నికల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.

ఆమె తన ఏకగ్రీవ ఎన్నికలకు సహకరించాలని తుమ్మలకు విజ్ఞప్తి చేసినా ఆయన పట్టించుకోలేదు. ఇక ఉప ఎన్నికల కోసం కేసీఆర్ స్వయంగా తన కుమారుడు కేటీఆర్ ను ఇన్చార్జిగా నియమించి రాష్ట్రస్థాయి నేతలు అందరిని పాలేరుకు పంపి ప్రచారం చేస్తే గాని తుమ్మలకు 40 వేల పైచిలుకు మెజార్టీ రాలేదు. కట్ చేస్తే రెండు సంవత్సరాలకే వచ్చిన ముందస్తు ఎన్నికలలో రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని కాంట్రాక్టర్ కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. తుమ్మల నిజంగానే పాలేరును అంత అభివృద్ధి చేసి ఉంటే.. ఆయన అంత గొప్ప రాజకీయ యోధుడు అయి ఉంటే ఉప ఎన్నికల్లో 45 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తి సాధారణ ఎన్నికల్లో ఎందుకు అంత చిత్తుగా ఓడిపోతాడు అన్న ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పాలి. ఆ మాటకు వస్తే తుమ్మల లాంటి నేత పార్టీ వేవ్‌లో గెలవడం కాదు.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు గెలిచి సత్తా చాటాలి. కానీ తుమ్మల కెరీర్లో అలాంటి గొప్ప విజయాలు ఎప్పుడూ రాలేదు.

1983 ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నంలోనే ఓట‌మి :
ఎన్టీఆర్ పార్టీ పెట్టి 1983లో భయంకరమైన తెలుగుదేశం ప్రభంజనం వీసినా సత్తుపల్లిలో తుమ్మల జల‌గం ప్రసాద్ రావు చేతిలో ఆరువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. విచిత్రం ఏంటంటే 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికలలో ఎన్టీఆర్‌ను గద్దె దించారు అన్న సానుభూతి నాటి సమైక్య రాష్ట్రంలో బలంగా వీచింది. కాంగ్రెస్‌ మహామ‌హులు అంద‌రూ మట్టి కరిచిపోయారు. అలాంటి గాలిలో కూడా తుమ్మల రాజకీయంగా పెద్దగా పేరు లేని ల‌క్కినేని జోగారావు పై కేవ‌లం 3 వేల‌ ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారు. 1989లో మళ్లీ జలగం ప్రసాద్ రావు చేతిలో తుమ్మ‌లకు ఘోర ఓటమి తప్పలేదు. 1994లో నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 26 సీట్లకే పరిమితం అయింది. అప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావుకు సత్తుపల్లిలో వచ్చిన మెజార్టీ 8000 లోపు మాత్రమే కావటం గమనార్హం. 1999లో మాత్రం తుమ్మల పొంగులేటి సుధాకర్ రెడ్డి పై 30000 పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. ఆయన కెరియర్లో ఏదైనా గొప్ప గెలుపు ఉందంటే 1999 విజయం మాత్రమే..! అది కూడా పొంగులేటి సుధాకర్ రెడ్డిని అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టటం పెద్ద మైనస్ అయింది.

ఇక 2004లో జలగం వెంకట్రావు చేతిలో పదివేల ఓట్ల తేడాతో ఓడిన తుమ్మల సత్తుపల్లి ఎస్సీల‌కు రిజర్వ్‌ కావడంతో 2009 ఎన్నికలకు ఖమ్మంకు మ‌కాం మార్చారు. ఆ ఎన్నికల్లో తుమ్మల ఇండిపెండెంట్గా పోటీ చేసిన జలగం వెంకట్రావుపై కేవలం 2000 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో కూడా తుమ్మల ఘోరంగా ఓడిపోయేవారే. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మైనార్టీ నేత యూన‌స్ సుల్తాన్‌కు 26 వేల‌ ఓట్లు రాగా.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జలగం వెంకట్రావుకు 51 వేల ఓట్లు వచ్చాయి. కేవలం కాంగ్రెస్ 26 వేల ఓట్లు చీల్చ‌డంతో 2000 ఓట్లతో తుమ్మల బయటపడ్డారే తప్ప.. వెంకట్రావుకు కాంగ్రెస్ టికెట్ దక్కి ఉంటే తుమ్మల చిత్తుగా ఓడిపోయేవారు. ఇందుకు పెద్ద ఉదాహరణ ఏంటంటే 2009 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావుకు ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ వరకు 57 వేల ఓట్ల మెజార్టీ వస్తే తుమ్మ‌లకు కేవలం 2000 మాత్రమే వచ్చింది. మరి తుమ్మల ఎంత‌ బలహీన నాయ‌కుడో చెప్పేందుకు ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇక 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత మంత్రి పువ్వాడ అజ‌య్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా కూడా తుమ్మ‌ల‌ను చిత్తుగా ఓడించి.. త‌ర్వాత బీఆర్ఎస్‌లో చేరారు.